రామ్ మందిర నిర్మాణానికి తేదీలు ఖరారు.. సాక్షి మహారాజ్ ఏమన్నారంటే ?

|

Oct 16, 2019 | 7:03 PM

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తేదీలు ఖరారయ్యాయా ? బిజెపి నేతల మాటల్ని వింటుంటే ఇదంతా ఓ ప్లాన్‌లో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయోధ్య వివాదంపై సుదీర్ఘకాలంపాటు జరిగిన విచారణ బుధవారంతో ముగియగా.. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అయితే నవంబర్ 17వ తేదీలోకా తీర్పు వెలువడడం ఖాయమన్న ఊహాగానాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం బలంగానే వుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, అయోధ్య కేసును విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం సారథి రంజయ్ గొగోయ్ […]

రామ్ మందిర నిర్మాణానికి తేదీలు ఖరారు.. సాక్షి మహారాజ్ ఏమన్నారంటే ?
Follow us on

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తేదీలు ఖరారయ్యాయా ? బిజెపి నేతల మాటల్ని వింటుంటే ఇదంతా ఓ ప్లాన్‌లో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయోధ్య వివాదంపై సుదీర్ఘకాలంపాటు జరిగిన విచారణ బుధవారంతో ముగియగా.. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అయితే నవంబర్ 17వ తేదీలోకా తీర్పు వెలువడడం ఖాయమన్న ఊహాగానాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం బలంగానే వుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, అయోధ్య కేసును విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం సారథి రంజయ్ గొగోయ్ నవంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. హిస్టారికల్ తీర్పు కాబట్టి ఆయన రిటైర్మెంట్‌కి ముందే తీర్పు వెలువరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమయ్యే తేదీలపై బిజెపి నేతలు ప్రకటనలు ప్రారంభించారు.

డిసెంబర్ 6నే ముహూర్తం ?

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్‌ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్‌ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని ఆయన అన్నారు. రామ మందిర్‌ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. బాబర్‌ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్‌ బోర్డు అంగీకరించాలన్నారు .మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ..తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు  విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే సాక్షి మహారాజ్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆయన వ్యాఖ్యలకు బిజెపి అధిష్టానం ఆమోదం వుందా లేదా అనే విషయం పక్కన పెడితే అయోధ్య తీర్పు హిందూ సంస్థలకు అనుగుణంగానే వెలువడుతుందన్న నమ్మకం సంఘ్ పరివార్ సంస్థల్లో బలంగా వినిపిస్తోంది. సో.. తీర్పు తమ పక్షమే కాబట్టి డిసెంబర్ 6 కంటే మంచి ముహూర్తం ఇంకేముంటుందని వారి వ్యాఖ్యానిస్తున్నారు.