Rajasthan Crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమైన 90 మంది ఎమ్మెల్యేలు.. ఆయనే కావాలంటూ..

|

Sep 26, 2022 | 12:00 AM

Rajasthan political crisis: రాజస్థాన్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. గంట గంటకు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. కొత్త సీఎం ఎంపిక కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.

Rajasthan Crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమైన 90 మంది ఎమ్మెల్యేలు.. ఆయనే కావాలంటూ..
Ashok Gehlot - Sachin Pilot
Follow us on

Rajasthan political crisis: రాజస్థాన్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. గంట గంటకు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. కొత్త సీఎం ఎంపిక కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. సీఎం అభ్యర్థిని ఎంపికకు ప్రత్యేకంగా సమావేశమైన సీఎల్‌పీ సమావేశానికి ముందే గెహ్లాట్‌ వర్గం రాజీనామాకు చేసింది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు సచిన్‌ పైలట్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. హైకమాండ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 25 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రిజైన్‌ పత్రాలు ఇచ్చారని తెలుస్తోంది. ఇది ఇప్పుడు కాంగ్రెస్‌లో సంచలనంగా మారింది. ఇక ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం నుంచి ఈ హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాల కోసం పోటీచేయబోతున్న సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ముందే సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎంను ఎంపిక చేయడానికి సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ హాజరుకాగా.. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ పాల్గొన్నారు. అయితే, సచిన్‌ పైలట్‌ రాజస్థాన్‌ కొత్త సీఎం అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని జీర్ణించుకోని అశోక్‌ గెహ్లాట్‌ వర్గీయులు రిజైన్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

అంతకు మందు హై కమాండ్‌ నిర్ణయంపై అశోక్‌ గెహ్లాట్‌ వర్గీయులు అత్యవసరంగా భేటీ అయ్యారు. గెహ్లాట్‌నే సీఎంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌ను కూల్చడానికి గతంలో పైలట్‌ ప్రయత్నించారని, ఆయనకు సీఎం పదవి ఎలా ఇస్తారని గెహ్లాట్‌ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో 10 మంది స్పీకర్‌ జోషిని కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ మేరకు ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ మాట్లాడుతూ.. గెహ్లాట్ అధ్యక్ష పోటీ నిర్ణయానికి ముందు తమను సంప్రదించలేదని.. తమ వెంట 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో రాజీనామాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తమను సంప్రదించకుండా సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నిర్ణయం ఎలా తీసుకుంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సూచనలను సీఎం గెహ్లాట్ పట్టించుకోవాలని.. తమ వెంట 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌సింగ్‌ ఖాచరియావాస్‌ పేర్కొన్నారు.

కాగా.. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య గత కొన్నేళ్ల నుంచి రాజకీయ పోరు నెలకొంది. డిసెంబర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ గెహ్లాట్‌ను మూడవసారి ముఖ్యమంత్రిగా ఎంపిక చేయగా..పైలట్‌ను డిప్యూటీగా నియమించింది. అనంతరం జూలై 2020లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ సమయంలో పైలట్‌తో పాటు 18 మంది పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లాట్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వారిని సముదాయించడంతో పైలట్ వెనక్కి తగ్గారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న గెహ్లాట్ పార్టీ నిబంధనల ప్రకారం..(వన్ మ్యాన్ వన్-పోస్ట్) ముందే సీఎం పదవికి రాజీనామా చేస్తారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ సమయంలో సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు దక్కుతాయని తెలుస్తోంది. ఈ ఊహగానాల మధ్య ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు సన్నిహితులైన 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంతో హైడ్రామా కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..