PM Modi: యూపీ సీఎం యోగికి మాతృ వియోగం.. ఫోన్ చేసి పరామర్శంచిన ప్రధాని మోదీ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆయన తల్లి మరణవార్త తెలిసి ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యోగి ఫ్యామిలీకి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే సీఎం యోగికి ఆయన ధైర్యం చెప్పి ఓదార్చారు.

PM Modi: యూపీ సీఎం యోగికి మాతృ వియోగం.. ఫోన్ చేసి పరామర్శంచిన ప్రధాని మోదీ
Pm Modi Calls Up Cm Yogi Adityanath

Updated on: Nov 20, 2026 | 4:35 PM

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సావిత్రి దేవి (91) కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్హ్వాల్ జిల్లాలో ఉన్న తన పూర్వీకుల గ్రామం పంచూర్‌లో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. సావిత్రి దేవి మరణంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అలాగే యోగి ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆయనకు ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు. ఇక శనివారం హరిద్వార్‌లో సావిత్రి దేవి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

యోగి కుటుంబానికి నేతల సంతాపం

సీఎం యోగి తల్లి సావిత్రి దేవి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు. తల్లి ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలు జీవితంలో అత్యంత విలువైనవని పేర్కొన్నారు. సావిత్రి దేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని యోగి ఆదిత్యనాథ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని బాబా కేదార్‌నాథ్‌ను ప్రార్థించారు.

రాజ్‌నాథ్ సింగ్ సంతాపం

ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యోగి ఆదిత్యనాథ్‌కు తన సానుభూతిని తెలియజేశారు. జీవితంలో ఏ దశలోనైనా తల్లిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో యోగి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా తమ సంతాప సందేశాలు పంపించారు.

మే నెలలో తల్లిని కలిసిన యోగి

అయితే గత మే నెలలో యోగి ఆదిత్యనాథ్ తన పూర్వీకుల గ్రామమైన పంచూర్‌కు వెళ్లి తన తల్లి సావిత్రి దేవిని కలిసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె తనను గుర్తుపట్టిందా అని యోగి అడిగినట్లు సమాచారం. ఇప్పుడు ఆమె మరణవార్తతో యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us