Parliament: ఉభయ సభల్లోనూ పెగాసస్‌, వ్యవసాయ చట్టాలపై రచ్చ.. కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్ వేటు

|

Jul 28, 2021 | 7:58 PM

పెగాసస్‌తోపాటు... వ్యవసాయ చట్టాలపై రచ్చ కొనసాగింది. కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌పై పేపర్లు విసిరేయడంతో సస్పెండ్‌ వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా..

Parliament: ఉభయ సభల్లోనూ పెగాసస్‌, వ్యవసాయ చట్టాలపై రచ్చ.. కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
Parliament Monsoon Session
Follow us on

Parliament Monsoon Session: పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్లీ అదే రచ్చ ఇవాళ ఇంకాస్త సీరియస్‌గానే విపక్షాలు అధికార బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించాయి. పెగాసస్‌తోపాటు… వ్యవసాయ చట్టాలపై రచ్చ కొనసాగింది. కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌పై పేపర్లు విసిరేయడంతో సస్పెండ్‌ వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా..

లోక్‌సభ ఇవాళ మరింత గందరగోళంగానే సాగిందిపార్లమెంట్ ఉభయసభలనూ పెగాసస్‌ స్పైవేర్ మరోసారి కుదిపేసింది. ఫోన్ హ్యాకింగ్‌పై చర్చ జరగాల్సిదే అన్న నినాదాలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోక్‌సభలో అయితే కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్‌ ఛైర్‌పైకి విసిరారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పదేపదే వాయిదా పడ్డాయి. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో లోక్‌సభ నుంచి 11మంది సభ్యులను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేశారు. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే పోడియం దగ్గరకు దూసుకొచ్చిన ఎంపీలు.. పెగాసస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆతర్వాత స్పీకర్‌ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌పై పేపర్లు చింపి విసిరేశారు.

దీనిపై స్పీకర్‌ ఓంబిర్లా సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. స్పీకర్‌పైకి పేపర్లు విసిరిన 11 మంది కాంగ్రెస్‌ ఎంపీలపై వేటు వేశారు. ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మాణిక్కం ఠాగూర్‌, డీఎన్‌ కురియకోజ్‌, హిబ్బిహిడన్‌, జోయిమని.. రవనీత్‌బిట్టు, గుర్జీత్‌ఔజ్లా, ప్రతాపన్‌, వైథిలింగం, సప్తగిరి శంకర్, ఏఎం ఆరిఫ్, దీపక్ బైజ్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ బిర్లా ప్రకటించారు.

ఇక పెగాసస్‌పై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి బీజేపీ ఎంపీలు డుమ్మా కొట్టారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సభ్యులు హాజరయ్యారు. పెగాసస్‌ స్నూపింగ్‌ గేట్‌పై చర్చించిన సభ్యులు.. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖకు నోటీసులు ఇచ్చారు. రేపు మరోసారి సమావేశంకావాలని నిర్ణయించారు.

అటు, రాజ్యసభలోనూ ఇదే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. విపక్షాల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేటికే వాయిదా పడింది. అనంతరం 12గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు సీట్ల నుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలూ మరోసారి వాయిదా మంత్రాన్నే జపించాయి.

Read Also…  Janasena Committee: విజయవాడ,నెల్లూరు నగర జనసేన పార్టీ కమిటీల నియామకం.. ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్