మోదీకి ‘మహా’ తలనొప్పి.. వచ్చే అయిదేళ్లు చుక్కలే !

| Edited By: Anil kumar poka

Oct 24, 2019 | 7:55 PM

గత అయిదేళ్ళుగా ఎదురులేని నేతగా వెలుగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకిక ఆ గుడ్ డేస్ పోయినట్లేనా ? సొంతంగా సీట్లున్న మిత్రధర్మాన్ని పాటిస్తూ తాము పోటీ చేసే సీట్ల సంఖ్యను తగ్గించుకుని మరీ శివసేనకు సీట్లను త్యాగం చేయడం ద్వారా మోదీ కొత్త తలనొప్పులను కొనితెచ్చుకున్నారా ? ఎస్.. పరిస్థితి అలాగే కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల దాకా అన్యోన్యంగా వున్న బిజెపి, శివసేన స్నేహంలో మోదీ ప్రధాని అయిన కొత్తలో జరిగిన పరిణామాలు చిచ్చు […]

మోదీకి మహా తలనొప్పి.. వచ్చే అయిదేళ్లు చుక్కలే !
Follow us on

గత అయిదేళ్ళుగా ఎదురులేని నేతగా వెలుగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకిక ఆ గుడ్ డేస్ పోయినట్లేనా ? సొంతంగా సీట్లున్న మిత్రధర్మాన్ని పాటిస్తూ తాము పోటీ చేసే సీట్ల సంఖ్యను తగ్గించుకుని మరీ శివసేనకు సీట్లను త్యాగం చేయడం ద్వారా మోదీ కొత్త తలనొప్పులను కొనితెచ్చుకున్నారా ? ఎస్.. పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల దాకా అన్యోన్యంగా వున్న బిజెపి, శివసేన స్నేహంలో మోదీ ప్రధాని అయిన కొత్తలో జరిగిన పరిణామాలు చిచ్చు రేపాయి. ఆనాడు శివసేన తరపున గెలిచిన సురేశ్ ప్రభును బిజెపిలోకి లాగడం ద్వారా శివసేన నాయకత్వానికి ఆగ్రహం తెప్పించారు కమల నాథులు. అది కాస్తా 2015 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటి వేర్వేరుగా పోటీ చేసే పరిస్థితికి దారి తీసింది.

అయితేనేం.. మాంచి ఊపుమీదున్న కమలం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే 120 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత నాలుగున్నరేళ్ళపాటు రెండు పార్టీలు కలిసి వుంటూనే తరచూ ఘాటు వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. అయితే పరస్పరం వున్న ప్రయోజనాల కారణంగా పూర్తిగా వేరు పడలేదు.. అలాగని మనస్పూర్తిగా కలిసి వుండలేదు.

అయితే.. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి అమాంతం పెరిగిన నరేంద్ర మోదీ చరిష్మాను విస్మరించే పరిస్థితి లేక శివసేన తాత్కాలికంగా తమ వ్యూహాలను పక్కన పెట్టి బిజెపితో కలిసి పోటీచేసి తగిన ప్రయోజనాన్ని పొందింది. అయితే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన ప్రత్యేక వ్యూహాన్ని రచించింది. బిజెపితో మంచిగా వుంటూనే తాము పోటీ చేసే సీట్ల సంఖ్యను పెంచుకుని, బిజెపికి 150 సీట్లలో మాత్రమే పోటీచేసే పరిస్థితి కల్పించింది.

దాంతో 150 సీట్లలో పోటీ చేసిన కమలం పార్టీ 103 స్థానాలలో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన నెంబర్‌కు సుదూరంలో నిలిచింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుంగా.. 145 సీట్లలో గెలిస్తే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వుండేది. బిజెపి పోటీ చేసిన 150 స్థానాలలో చాలా చోట్ల శివసేన శ్రేణులు కమలనాథులకు సహకరించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మోదీ చరిష్మా శివసేన అభ్యర్థులకు పెద్ద ఎత్తున లాభపడింది. దాంతో శివసేన నెంబర్ పెరిగింది. బిజెపి నెంబర్ తగ్గి తప్పనిసరిగా శివసేనపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది.

తమ నెంబర్ పెరుగుతున్న సంకేతాలు కనిపించీ కనిపించగానే శివసేన గళంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ సీఎం సీటును చెరో రెండున్నరేళ్ళు, మంత్రి పదవులను చెరి సగం పంచుకోవాలని డిమాండ్ తెరమీదికి తెచ్చారు. మిత్రధర్మం కోసం సీట్ల సంఖ్య తగ్గించుకుంటే ఫలితాల తర్వాత శివసేన ఇలా మారిపోవడం కమలనాథులకు చిర్రెత్తించినా.. అంతిమంగా బిజెపి, శివసేన కలిసి వుంటేనే ఇద్దరికీ ప్రయోజనం అనే సూత్రం ఆధారంగా మిత్రపక్షంతో మంతనాలు ప్రారంభించారు కమలనాథులు.

అదిత్య థాక్రేని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న ఉద్ధవ్ థాక్రే.. అందుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. ఈ పుత్రవాత్సల్యమే మిత్రధర్మంలో చిచ్చు రేపితే.. అంతిమంగా అది రెండు పార్టీలకు ఎంబర్రాసింగ్ సిచ్యుయేషన్ తేక మానదు. ఈ బేరసారాలు పెరిగిపోతే.. శివసేన కేంద్రంలో మంత్రి పదవుల నెంబర్ పెంచాలని మోదీని కోరే అవకాశమూ లేకపోలేదు. వెరసి.. బిజెపికి శివసేన తలనొప్పులు క్రమంగా పెరిగే పరిస్థితే కనిపిస్తోంది. ఇది అంతిమంగా మోదీకి, అమిత్ షాకు కొత్త తలనొప్పులకు కారణం కాకమానవు.