స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి.. తమిళ రాజకీయాల్లో విషాదం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి సంచలన విజయం నమోదు చేసిన కొలత్తూరు ఎమ్మెల్యే వి.ఎస్. బాబు ఇకలేరు. ఊపిరితిత్తుల సమస్యతో సెప్టెంబర్ 9న ఆసుపత్రిలో చేరిన ఆయన, 71 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల్లో పనిచేస్తూ తనదైన ముద్ర వేసిన వి.ఎస్. బాబు మరణం తమిళనాడు రాజకీయాల్లో తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి.. తమిళ రాజకీయాల్లో విషాదం..
Kolathur Mla Vs Babu Passes Away

Updated on: Nov 19, 2026 | 4:02 PM

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని కొలత్తూరు నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత రెండు నెలలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఎం.కె. స్టాలిన్‌ వంటి దిగ్గజ నేతపై గెలిచి సంచలనం సృష్టించిన ఆయన ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 9న వి.ఎస్. బాబు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. గత 71 రోజులుగా ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు ప్రాణరక్షక చికిత్స కొనసాగింది.

గుండెపోటుతో తుదిశ్వాస

చికిత్స కొనసాగుతుండగానే గురువారం మధ్యాహ్నం వి.ఎస్. బాబుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈరోజు మధ్యాహ్నం 2:24 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

డీఎంకే నుండి టీవీకే వరకు రాజకీయ ప్రస్థానం

వి.ఎస్. బాబు తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున పురసైవాక్కం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో డీఎంకే నాయకత్వంతో తలెత్తిన విభేదాల కారణంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏఐఏడీఎంకేలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకేను వీడి, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగంలో పనిచేశారు.

స్టాలిన్‌పై గెలిచి సంచలనం

ఆ తర్వాత విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీలో చేరిన వి.ఎస్. బాబు, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌పై పోటీ చేసి, ఆయన కంటే ఎక్కువ ఓట్లు సాధించి సంచలన విజయం నమోదు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఆ సమయంలోనే అనారోగ్యానికి గురయ్యారు. వి.ఎస్. బాబు మృతి పట్ల తమిళనాడు రాజకీయ ప్రముఖులు, టీవీకే నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us