PM Modi: 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం: మోదీ

|

Feb 11, 2024 | 10:15 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలను కాంగ్రెస్‌ చిన్నచూపు చూసిందన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ కనుమరుగవుతుందన్నారు మోదీ.

PM Modi: 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం: మోదీ
PM Modi
Follow us on

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు మోదీ.

ఆదివాసీ ప్రాంతాలపై ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు . అందుకే జాబువాలో సభ నిర్వహించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు మోదీ. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించడం ఖాయమన్నారు మోదీ. బీజేపీ సొంతంగా 370 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల తరువాత ఇండియా కూటమి మాయమవుతుందన్నారు

“ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని విపక్ష ఎంపీలే పార్లమెంట్‌లో చెబుతున్నారు. 2024 మరోసారి మోదీ సర్కార్‌ ఖాయం. ఎన్డీఏకు 400 సీట్లు తప్పకుండా వస్తాయి ” అని మోదీ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో రూ.7550 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించారు మోదీ. ఆదివాసీల కష్టాలను కాంగ్రెస్‌ ఎప్పుడు పట్టించుకోలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ కనుమరుగవుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం.. అధికారంలో లేనప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటని అన్నారు మోదీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గుతోందన్నారు మోదీ. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలయ్యిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…