
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ముంబైకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి హైజాకింగ్ బెదిరింపు రావడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో అద్దంపై హైజాకింగ్‌కు సంబంధించిన బెదిరింపు సందేశం రాసి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు.
వెంటనే భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. విమానాన్ని సాధారణ పార్కింగ్ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బేకు తరలించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), విమానాశ్రయ భద్రతా అధికారులు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. విమానంలో అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లేదా ఇతర ప్రమాదకర వస్తువులు ఉన్నాయా? అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ విమానం AI 772 నంబర్‌తో నడిచే ఎయిర్‌బస్ A320neoగా గుర్తించారు. ఇందులో ఐదుగురు సిబ్బందితో పాటు 93 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రయాణికుడికి సంబంధించిన అంశం కూడా ఈ అలర్ట్‌కు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే టాయిలెట్ అద్దంపై సందేశం కనిపించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ప్రస్తుతం విమానంలో తనిఖీలు, బెదిరింపు సందేశం వెనుక ఉన్న వ్యక్తుల గుర్తింపు, అసలు ముప్పు ఉందా లేదా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా తనిఖీలు పూర్తయి అధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాతే విమానం తదుపరి ప్రయాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఘటనతో కోల్‌కతా విమానాశ్రయంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..