
గురుగ్రామ్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.80 వేల విలువైన బైక్‌పై ఏకంగా రూ.10.30 లక్షల మేర పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం ఉద్యాగ్ విహార్‌లోని శంకర్ చౌక్ సమీపంలో ఓ యువకుడు బైక్‌ను రాంగ్ రూట్‌లో నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌ను తనిఖీ చేయగా మొత్తం 126 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బైక్‌ను అంకేష్ కుమార్ అనే వ్యక్తి 2023 జూలైలో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బైక్‌పై వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ కలిగి ఉండటం వంటి ఉల్లంఘనలకు పలుమార్లు జరిమానాలు విధించారు. అయితే ఇప్పటివరకు ఒక్క చలాన్ కూడా చెల్లించలేదని పోలీసులు తెలిపారు.
తాజాగా మళ్లీ రాంగ్ సైడ్‌లో బైక్ నడుపుతూ పట్టుబడటంతో అధికారులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పెండింగ్ చలాన్ల మొత్తం రూ.10.30 లక్షలకు చేరినట్లు తేలింది. అంటే బైక్ అసలు ధర కంటే అనేక రెట్లు ఎక్కువగా జరిమానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే చలాన్లు ఎలా పేరుకుపోతాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం బైక్‌పై నమోదైన అన్ని చలాన్లను పరిశీలిస్తున్న పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..