
భార్యాభర్తల బంధం అంటే కేవలం మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు.. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం, ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం. అలాంటి అచంచలమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి కథ. తన ప్రాణాలను కాపాడేందుకు సర్వస్వం త్యాగం చేసిన భార్యను దేవతగా భావిస్తున్న ఓ భర్త.. ఆమె మరణానంతరం ఏకంగా ఆలయాన్నే నిర్మిస్తున్నారు. ఈ హృదయాన్ని కదిలించే ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రమాదంతో జీవితమే తలకిందులు..!
గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోధ్రాకు చెందిన 65 ఏళ్ల బాబుభాయ్ లింబా తన భార్య సుంఘదిబెన్ జ్ఞాపకార్థం వ్యవసాయ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 2007లో పొలంలో పనిచేస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో బాబుభాయ్ తన ఎడమ చేతిని కోల్పోయారు. అప్పటికి ఆయనకు ఆరుగురు పిల్లలు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆదాయ వనరు కావడంతో ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది.
భర్త ప్రాణాల కోసం ఇంటి సామాన్లు అమ్మి.. భిక్షాటన!
భర్తకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో సుంఘదిబెన్ తన ఇంట్లోని వస్తువులను సైతం అమ్మేసింది. అయినప్పటికీ చికిత్స ఖర్చులకు డబ్బులు సరిపోలేదు. దీంతో ఆమె వెనుకడుగు వేయకుండా ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసింది. అలా వచ్చిన డబ్బులతో భర్తకు చికిత్స చేయించి, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆయన ప్రాణాలను కాపాడుకుంది. ఆరుగురు పిల్లల బాధ్యతను మోస్తూనే భర్తకు అండగా నిలిచింది.
భార్య మరణంతో విషాదం.. ఆమె కోసం ఆలయం!
అయితే గత ఏడాది సుంఘదిబెన్ కన్నుమూశారు. భార్య మరణాన్ని బాబుభాయ్ తట్టుకోలేకపోయారు. తన జీవితంలో ఆమె చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేని ఆయన.. ఆమె జ్ఞాపకాలను శాశ్వతంగా నిలిపేందుకు ఆలయం నిర్మించాలని భావించారు. గోధ్రాలోని అబ్రామ్ పటేల్ మువాడ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆయనకు 15 మంది సభ్యులతో కూడిన ఉమ్మడి కుటుంబం కూడా అండగా నిలుస్తోంది. భార్య గురించి మాట్లాడుతున్న సమయంలో బాబుభాయ్ భావోద్వేగానికి గురయ్యారు. “నా కష్టకాలంలో నా భార్య నాకు అండగా నిలబడకపోయి ఉంటే, నేను ఎప్పుడో చనిపోయేవాడిని. ఆమె చేసిన త్యాగాన్ని జీవితాంతం మర్చిపోలేను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
భార్యపై భర్తకు ఉన్న ప్రేమ, ఆమె చేసిన నిస్వార్థ సేవకు ఈ ఆలయం ప్రతీకగా నిలవనుంది. డబ్బు, ఆస్తులు, హోదాల కంటే ఆపదలో తోడుగా నిలిచే మనిషి విలువ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నిజమైన ప్రేమకు మరణం కూడా ముగింపు కాదని నిరూపిస్తున్న ఈ కథ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..