Byju Raveendran: బైజూస్ రవీంద్రన్కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు

|

Feb 22, 2024 | 9:02 PM

బైజూస్‌ రవీంద్రన్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆయనకు లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది ఈడీ. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అవడంతో రవీంద్రన్‌ ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. బైజూస్‌ పేరెంట్ కంపెనీ థింక్‌ అండ్‌ లెర్న్‌ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోన్న తరుణంలో రవీంద్రన్‌కు లుకౌట్‌ నోటీసులు రావడం కలకలం రేపుతోంది.

Byju Raveendran: బైజూస్ రవీంద్రన్కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు
Byju Raveendran
Follow us on

ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు. ఈడీ అధికారులు గత ఏడాది బెంగళూరులోని రవీంద్రన్‌ రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా సోదాలు జరిపింది. ఇప్పటికే ఆయనపై ఆన్‌ ఇంటిమేషన్‌ లుకౌట్‌ సర్క్యులర్‌ అమల్లో ఉంది. దీని ప్రకారం విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది.

తాజాగా పూర్తిస్థాయి లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అవడంతో రవీంద్రన్‌ ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. బైజూస్‌ పేరెంట్ కంపెనీ థింక్‌ అండ్‌ లెర్న్‌ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోన్న తరుణంలో రవీంద్రన్‌కు లుకౌట్‌ నోటీసులు రావడం కలకలం రేపుతోంది. సంస్థ విలువ ఏడాది వ్యవధిలో రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉంది. మరోవైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు అసాధారణ బోర్డు సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకోవాలని నిర్ణయించారు. సమావేశం ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు.

వాటాదారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ బైజూస్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. అయితే అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని ఆదేశించింది. బైజూస్‌లో ఇన్వెస్టర్లుగా ఉన్న ప్రోసస్‌, పీక్‌ ఎక్స్‌వీ, సోఫినా, లైట్‌స్పీడ్‌, జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థలు ఈజీఎంకు పిలుపునిచ్చినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…