Delhi CM: కేజ్రీవాల్ బరువుపై వివాదం.. జైలు అధికారులు ఏం చెబుతున్నారంటే?

| Edited By: Srikar T

Jul 15, 2024 | 8:50 PM

రాజకీయ నాయకుల 'బరువు' సైతం వార్తాంశంగా మారి వివాదం సృష్టిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇదే జరుగుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టయి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఏకంగా 8.5 కేజీల బరువు తగ్గిపోయారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Delhi CM: కేజ్రీవాల్ బరువుపై వివాదం.. జైలు అధికారులు ఏం చెబుతున్నారంటే?
Arvind Kejriwal
Follow us on

రాజకీయ నాయకుల ‘బరువు’ సైతం వార్తాంశంగా మారి వివాదం సృష్టిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇదే జరుగుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టయి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఏకంగా 8.5 కేజీల బరువు తగ్గిపోయారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో పరిస్థితులు బాగోలేవని, అందుకే రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్‌‌ ఆందోళనకర రీతిలో బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తిహార్ జైలు అధికారులు ఖండిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఆప్ నేతలు ఆరోపించిన స్థాయిలో కేజ్రీవాల్ బరువు తగ్గలేదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు కేజ్రీవాల్ గతంలో ఎంత బరువున్నారు.. ప్రస్తుతం ఎంత బరువున్నారు అన్న విషయాలు లెక్కాపత్రాలతో సహా కేంద్ర హోంశాఖకు నివేదించారు.

జైలు అధికారుల నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1, 2024న మొదటిసారి కేజ్రీవాల్ తీహార్ జైలుకు వచ్చినప్పుడు ఆయన 65 కేజీల బరువున్నారు. మధ్యంతర బెయిల్‌పై మే 10న కేజ్రీవాల్ తీహార్ నుంచి బయటికొచ్చినప్పుడు 64 కేజీలున్నారు. జూన్ 2న జైలులో లొంగిపోయినప్పుడు 63.5 కేజీలున్నారు. ప్రస్తుతం (జులై 14న) కేజ్రీవాల్ బరువు 61.5 కేజీలున్నారు. అంటే జైలు అధికారుల లెక్కల ప్రకారం రెండోసారి జైలుకు వచ్చినప్పటి నుంచి 2 కేజీల బరువు తగ్గారు. మొదటి సారి చేరినప్పటి నుంచి పోల్చి చూస్తే.. 3.5 కేజీల బరువు తగ్గారు. ఇదంతా కూడా ఆయన జైలులో మితంగా తినడం వల్లనే అని జైలు సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

సీనియర్ వైద్యులు, అధికారుల పర్యవేక్షణలో ప్రతిరోజూ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు మెడికల్ బోర్డుతో సంప్రదింపుల సమయంలో జరిపిన వైద్య పరీక్షల సమయంలో కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఉన్నారని వెల్లడించారు. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించిన స్థాయిలో కాకపోయినా.. కేజ్రీవాల్ బరువు తగ్గారన్నది మాత్రం జైలు అధికారులు కూడా అంగీకరించారు. ఇదే విషయాన్ని కోర్టులో బెయిల్ కోసం వాదనలు వినిపిస్తున్న సమయంలో ప్రస్తావించగా.. కేజ్రీవాల్‌కు తాము జైలు ఆహారం ఇవ్వడం లేదని, కోర్టు ఆదేశాల మేరకు ఇంటి నుంచి పంపిన ఆహారాన్నే అందజేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. అలాంటప్పుడు బరువు తగ్గడం, పెరగడం విషయంలో తమపై నిందలు వేయడం తగదని వాదించారు.

అయితే ఇప్పుడు జైలు అధికారులను, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆప్ నేతలు ఆరోపణలు గుప్పించడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. దురుద్దేశంతోనే ఆప్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఆప్ నేతలు పెడుతున్న సోషల్ మీడియా పోస్టుల్లో.. కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టయినప్పటి నుంచి ఇప్పటి వరకు 8.5 కేజీల బరువు తగ్గారని ఆరోపిస్తూ.. ఆయన బ్లడ్ షుగర్ స్థాయులు 50 కంటే తక్కువకు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా 5 పర్యాయాలు జరిగిందని, ఈ పరిస్థితి ప్రాణాలకు ముప్పు కల్గిస్తుందని పేర్కొన్నారు. నిద్రిస్తున్న సమయంలో బ్లడ్ షుగర్ స్థాయులు పడిపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తున్న కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక మిగిలిన సీబీఐ కేసులోనూ బెయిల్ వస్తే ఆయనకు జైలు నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందడం కోసమే ఆప్ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..