Delhi Bomb Threat: ఎక్కడో స్విచ్ వేస్తే.. ఇక్కడ కలకలం.. ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఎక్కణ్ణుంచి వచ్చిందంటే?

| Edited By: Balaraju Goud

May 22, 2024 | 10:21 AM

ఇంటర్నెట్ ఆవిర్భావం తర్వాత సాధారణ నేరాలను సైతం ప్రపంచంలో ఏ మూలనో కూర్చుని మరో మూలన చేయగలుగుతున్నారు. 'ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో బల్బ్ వెలిగినట్టుగా'.. ఖండాలు, మహా సముద్రాల అవతల ఓ గదిలో కూర్చుని.. మరెక్కడో కలకలం సృష్టించగల్గుతున్నారు.

Delhi Bomb Threat:  ఎక్కడో స్విచ్ వేస్తే.. ఇక్కడ కలకలం.. ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఎక్కణ్ణుంచి వచ్చిందంటే?
Delhi Bomb Threat
Follow us on

ప్రపంచంలో జరిగే నేరాల తీరు ఇంటర్నెట్‌కు ముందు.. ఇంటర్నెట్ తర్వాత అని వర్గీకరించవచ్చు. ఇంటర్నెట్ లేని రోజుల్లో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం వంటి దుశ్చర్యలు మాత్రమే సుదూర ప్రాంతాల్లో కూర్చుని ప్రణాళికలు రచించి, విధ్వంసాలకు పాల్పడేవారు. నేరస్థులు ఈ క్రమంలో నిఘా వర్గాలకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా వివిధ రకాల కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించేవారు. వారి కమ్యూనికేషన్‌ను ఒకవేళ మధ్యలోనే పసిగట్టినా.. దాన్ని డీకోడ్ చేయడం కూడా అంత సులభంగా ఉండేది కాదు. ఇక ఇంటర్నెట్ ఆవిర్భావం తర్వాత సాధారణ నేరాలను సైతం ప్రపంచంలో ఏ మూలనో కూర్చుని మరో మూలన చేయగలుగుతున్నారు. ‘ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో బల్బ్ వెలిగినట్టుగా’.. ఖండాలు, మహా సముద్రాల అవతల ఓ గదిలో కూర్చుని.. మరెక్కడో కలకలం సృష్టించగల్గుతున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీని హడలెత్తించిన బాంబు బెదిరింపు వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మే నెల ప్రారంభంలో ఢిల్లీలోని దాదాపు 150 పాఠశాలలకు ఏకకాలంలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ బెదిరింపు స్కూల్ యాజమాన్యాలనే కాదు.. పిల్లల తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. బెదిరింపు మెయిల్ గమనించిన యాజమాన్యాలు పోలీసులకు సమాచారం ఇచ్చి, పిల్లలందరినీ బయటికి పంపించేశాయి. బాంబు స్క్వాడ్‌లతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయా పాఠశాలలను అణువణువూ తనిఖీ చేసి.. ఎలాంటి ముప్పు లేదని తేల్చారు. ఆ బెదిరింపు కేవలం ఆకతాయి చర్యగా గుర్తించారు. కానీ ఒక మహా నగరంలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలను ఒక్క ఈ-మెయిల్‌లో వణికించిన ఆ ఆకతాయి ఎవరన్నది తేల్చే పనిలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటర్నెట్ యుగంలో నేరాల తీరు!

ఇంటర్నెట్ ఉపయోగించి నేరాలకు పాల్పడినప్పుడు ఆ సందేశం ఎక్కణ్ణుంచి వచ్చిందనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటర్నెట్‌‌కు అనుసంధానించిన ప్రతి పరికరానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అలాగే వారు కనెక్ట్ అయిన నెట్‌వర్క్‌కి ఇంటర్నెట్ ప్రొటోకాల్ (IP) అడ్రస్ కూడా ఉంటుంది. ఎవరైనా ప్రపంచంలో ఎక్కణ్ణుంచి ఎలాంటి సందేశం పంపినా.. వారు పంపిన ప్రదేశం, ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని గుర్తించవచ్చు. అయితే ఒక దేశంలో కూర్చుని, మరో దేశంలో నేరాలకు పాల్పడేవారిని పట్టుకోవడం అంత సులభం కాదు. నేరానికి పాల్పడ్డవారెవరిని గుర్తించినా సరే.. ఆయా దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందాల మేరకే తదుపరి దర్యాప్తు చేయడం సాధ్యపడుతుంది. ఒకవేళ ఆ రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనట్టయితే.. నేరస్థులను గుర్తించినా సరే పోలీసులు చేయడానికేమీ ఉండదు.

దీన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. అంతేకాదు, ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా పేరొందిన పాకిస్తాన్ వంటి దేశాల్లో కూర్చుని ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో విధ్వంసాలకు తెగబడుతుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వెబ్‌సైట్లపై సైబర్ దాడులకు పాల్పడి సమాచార నష్టాన్ని కూడా కల్గిస్తుంటారు. లేదంటే వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి, వారి యూజర్ నేమ్ – పాస్‌వర్డ్‌లను తస్కరించి ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు. ఇంకా అనేక రకాల సైబర్ మోసాలకు ఇంటర్నెట్ ఒక సాధనంగా మారింది.

బుడాపెస్ట్ టూ ఢిల్లీ.. వయా ఇంటర్నెట్

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపిందెవరో కనిపెట్టేందుకు ఢిల్లీ పోలీసులు తమ సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయా స్కూల్లకు వచ్చిన ఈ-మెయిల్ హంగేరి దేశ రాజధాని నరగమైన బుడాపెస్ట్ నుంచి వచ్చినట్టు ఐపీ (IP) అడ్రస్ ద్వారా గుర్తించారు. అయితే ఆ ఈ-మెయిల్ సర్వర్ (mail.ru) మాత్రం రష్యాలో ఉందని గుర్తించారు. వెంటనే అటు రష్యా, ఇటు హంగేరీ దేశాల పోలీసు విభాగాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇంటర్‌పోల్ సహకారాన్ని కూడా తీసుకుని ఈ బెదింపు మెయిల్ పంపిన దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిల్ సర్వర్ సర్వీస్ అందజేస్తున్న mail.ru సంస్థకు కూడా లేఖ రాశారు. కొన్ని సందర్భాల్లో సైబర్ నేరాల్లో ఆరితేరిన నేరగాళ్లు తమ ఐపీ అడ్రస్‌ను దర్యాప్తు సంస్థలు గుర్తించకుండా ఉండేందుకు ‘ఐపీ మాస్క్’ లేదా ‘డైనమిక్ ఐపీ అడ్రస్’ వంటి టెక్నిక్ ఉపయోగిస్తూ ఉంటారు. తద్వారా వారు పంపిన సందేశం ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకోవడం దర్యాప్తు సంస్థలకు కష్టంగా మారుతుంది.

అయితే, ఈ బాంబు బెదిరింపు విషయంలో అలాంటిదేమీ జరగలేదని, ఆకతాయిలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అర్థమవుతోంది. కేవలం ఢిల్లీలోనే కాదు, ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ నగరంలోని పలు స్కూళ్లకు ఇదే తరహా బెదిరింపు సందేశాలు వచ్చాయి. గోమతి నగర్‌లోని విబ్‌గ్యోర్ పాఠశాల కార్యాలయానికి వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్‌తో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేయగా.. అది కూడా ఉత్తుత్తి బెదిరింపే అని తేలింది. ఈ ఘటనపై యూపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ, లఖ్‌నవూ ఘటనలకు బాధ్యులు ఒకరేనా లేక ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడ్డారా అన్నది మరికొన్నాళ్లలో తేలనుంది. ఎక్కడో యూరప్ ఖండంలో ఉన్న ఓ చిన్న దేశం హంగేరి నుంచి ప్రపంచంలోనే జనాభా పరంగా అతి పెద్ద దేశంగా ఉన్న భారత్‌లో కలకలం సృష్టించిన ఆ దుండగులను పట్టుకోవడం కోసం ఢిల్లీ పోలీసులు మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…