
ముంబై: బయటకు చూస్తే అది సాధారణంగా మూసివేసిన డేకేర్ సెంటర్. భవనం బయట ‘డేకేర్ సెంటర్.. త్వరలో ప్రారంభం’ అంటూ బోర్డు కనిపిస్తోంది. అయితే లోపలికి వెళ్లే గేటుకు తాళం వేసి ఉంది. కొంతకాలంగా ఆ ప్రదేశం నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. రోజులు గడిచేకొద్దీ వాసన మరింత తీవ్రమవడంతో చివరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా.. అక్కడ ఓ మృతదేహం కనిపించింది.
ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసి ఉన్న డేకేర్ సెంటర్ నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి ప్రాంగణాన్ని పరిశీలించారు. లోపల దుర్వాసన మరింత తీవ్రంగా ఉండటంతో మొత్తం ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా మృతదేహం బయటపడింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆ వ్యక్తి 2022 జూన్‌లో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కుమార్తె తన తండ్రిని దూరం చేసుకోవడానికి ఇష్టపడలేదు. తండ్రి మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకోవాలనే ఉద్దేశంతో సాధారణ అంత్యక్రియలు నిర్వహించకుండా భద్రపరచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం విదేశాలకు చెందిన ఓ సంస్థ సేవలను ఆమె వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమే ఈ నిర్ణయానికి కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మృతదేహాన్ని ఇంతకాలం భద్రపరిచిన వ్యవహారంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పాత్రతో పాటు మృతదేహాన్ని భద్రపరిచిన విధానం, అందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఈ కేసులో తన తరఫున వాదించేందుకు ఆ మహిళ న్యాయవాదులను నియమించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కురార్ పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.