Aadhaar: యూటర్న్ తీసుకున్న కేంద్రం..ఆధార్ జిరాక్స్‌ సూచనలు వెనక్కి.. ఆ ఛాన్స్‌ లేదంటూ వివరణ

|

May 29, 2022 | 6:03 PM

ఆధార్‌ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్‌ కార్డు ఫొటోకాపీ (జిరాక్స్‌)ని మాత్రమే ఇవ్వాలంటూ జారీ చేసిన మార్గదర్శకాలను.. సాయంత్రం ఉపసంహరించుకుంది కేంద్రం.

Aadhaar: యూటర్న్ తీసుకున్న కేంద్రం..ఆధార్ జిరాక్స్‌ సూచనలు వెనక్కి.. ఆ ఛాన్స్‌ లేదంటూ వివరణ
Follow us on

ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆధార్‌ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్‌ కార్డు ఫొటోకాపీ (జిరాక్స్‌ Photocopies)ని మాత్రమే ఇవ్వాలంటూ జారీ చేసిన మార్గదర్శకాలను.. సాయంత్రం ఉపసంహరించుకుంది కేంద్రం. ఇటీవల కొందరు వ్యక్తులు ఆధార్‌ కార్డులకు ఫొటోషాప్‌లో మార్పులు చేసి దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులోని స్థానిక యూఐడీఏఐ కార్యాలయం సదరు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది. అలాంటి చర్యలను అరికట్టడంలో భాగంగానే ఈ ఉదయం ఆ పత్రికా ప్రకటన జారీ చేయాల్సి వచ్చిందని వివరించింది కేంద్రం. అయితే, దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నామని కేంద్రం తాజా ప్రకటనలో పేర్కొంది.

ప్రకటన ఎందుకు ఉపసంహరించుకున్నారు?

ఆధార్‌ వినియోగంలో పౌరులు తమ విచక్షణ, అక్కడి పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఆధార్‌లోని వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. అనధీకృత వ్యక్తులు, సంస్థలు ఆధార్‌లో గోప్యంగా ఉండే వివరాలను పొందే అవకాశం లేదని తెలిపింది. యూఐడీఏఐ వ్యవస్థను అంత పటిష్ఠంగా రూపొందించామని పేర్కొంది.

మీ స్వంత విచక్షణను ఉపయోగించండి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక నోటీసును జారీ చేసింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు దానిని ఉపయోగించడానికి,  భాగస్వామ్యం చేయడానికి ముందు సాధారణ విచక్షణను పాటించవలసి ఉంటుంది. అతను ఎవరితోనైనా ఆధార్ నంబర్‌ను పంచుకునే ముందు పూర్తి విచారణ చేయాలని పేర్కొంది.