Atmanirbhar Bharat: 5 లక్షల ఏకే- 203 రైఫిల్స్‌ తయారీకి కేంద్రం ఆమోద ముద్ర.. సాంకేతిక సహకారం అందించనున్న రష్యా..

|

Dec 04, 2021 | 12:20 PM

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా 5లక్షల ఏకే -203 అసాల్ట్‌ రైఫిల్స్ తయారీకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు తోడు రక్షణ పరికరాల తయారీ రంగంలో స్వావలంబన సాధించడంలో

Atmanirbhar Bharat: 5 లక్షల ఏకే- 203 రైఫిల్స్‌ తయారీకి కేంద్రం ఆమోద ముద్ర.. సాంకేతిక సహకారం అందించనున్న రష్యా..
Follow us on

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా 5లక్షల ఏకే -203 అసాల్ట్‌ రైఫిల్స్ తయారీకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు తోడు రక్షణ పరికరాల తయారీ రంగంలో స్వావలంబన సాధించడంలో భాగంగా ఈ గన్స్‌ తయారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది . రష్యా సాంకేతిక సహాయంతో ఉత్తరప్రదేశ్‌ అమేథీ సమీపంలో నున్న కోర్వా యూనిట్‌లో వీటిని తయారుచేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర సాయుధ బలగాలు ఐఎన్ఎస్ఏఎస్(INSAS) గన్స్ ను వాడుతున్నాయి. వీటి స్థానంలో 7.62 X 39 ఎంఎమ్‌ క్యాలిబర్‌ AK-203ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పాపులర్ ఏకే–47 గన్స్‌కు అప్ గ్రేడే ఈ ఏకే–203 రైఫిల్స్‌. ప్రపంచంలోని చాలా దేశాలు, టెర్రరిస్టు గ్రూఫులు ఈ అత్యాధునిక రైఫిల్స్‌ను వాడుతున్నాయి.

‘ఇండో- రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ రైఫిల్స్‌ను తయారుచేస్తున్నాం. రష్యాకు చెందిన కలాష్నికోవ్‌ అనే సంస్థ వీటి తయారీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇండియా- రష్యా దేశాల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇక రైఫిల్స్‌ తయారీకి అవసరమైన కావాల్సిన ముడి పదార్థాల తయారీ కోసం రక్షణరంగంలో ఉండే వివిధ మధ్య తరగతి, చిన్న తరహా పరిశ్రమలకు పని పెరుగుతుంది. ఆయా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ పొడవునా ఏర్పడ్డ ఉద్రిక్తతలు, దేశంలో ఉగ్రవాద, తిరుగుబాటు దాడులను నిలువరించేందుకు వీలుగా మన ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు అవకాశం కలుగుతుంది’ అని రక్షణ శాఖకు చెందిన ఒక సీనియర్‌ అధికారి చెప్పుకొచ్చారు.