Bihar Politics: బీహార్‌ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు తథ్యం.. చిరాగ్ పాశ్వన్ జోస్యం

|

Aug 08, 2022 | 6:15 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేరని ధివంగత రాంవిలాస్ పాశ్వన్ తనయుడు, ఎల్జేపీ (ఆర్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వన్ (Chirag Paswan) జోస్యం చెప్పారు. బీహార్‌ అసెంబ్లీకి ఇక ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

Bihar Politics: బీహార్‌ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు తథ్యం.. చిరాగ్ పాశ్వన్ జోస్యం
Chirag Paswan (File)
Follow us on

బీహార్‌లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. కొత్త పొత్తులు పొద్దుపొడుస్తున్నాయి. బీహార్ ఎన్డీయేలో చీలిక అనివార్యంగా తెలుస్తోంది. సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయు.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం నితీశ్.. ఆమెను నేరుగా కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. విపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో నితీశ్ కుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్జేడీని బీజేపీ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతోందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు బీహార్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీహార్‌లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన చిరాగ్ పాశ్వన్.. మరోసారి నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేరని ధివంగత రాంవిలాస్ పాశ్వన్ తనయుడు, ఎల్జేపీ (ఆర్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వన్ జోస్యం చెప్పారు. బీహార్‌ అసెంబ్లీకి ఇక ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంటోందని చిరాగ్ అన్నారు. మహాకూటమితో చేతులు కలిపి తన కుర్చీని నితీశ్ కుమార్ ప్రస్తుతానికి కాపాడుకున్నా.. ఆ పదవిలో ఆయన ఐదేళ్ల పదవీకాలాన్ని (2025 వరకు) పూర్తి చేసుకోవడం మాత్రం అసాధ్యమన్నారు. మహాకూటమి నేతలు కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారని.. దీంతో అక్కడ మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యమన్నారు. తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకున్న మరుక్షణమే నితీశ్ కుమార్.. పల్టీమార్ ప్లాన్‌ను అమలు చేస్తారని ఎద్దేవా చేశారు.

గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే చిరాగ్ పాశ్వాన్.. నితీష్ కుమార్ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో ఆయన బీహార్‌లో ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు అభ్యర్థులకు పోటీగా తమ పార్టీ అభ్యర్థులను చిరాగ్ పాశ్వాన్ బరిలో నిలిపారు. చాలా స్థానాల్లో జేడీయు అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బకొట్టారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేలో చిరాగ్ పాశ్వాన్‌ను భాగస్వామిగా కొనసాగించడం పట్ల జేడీయు నుంచి అభ్యంతరాలు వ్యక్తంకావడం.. ఆ తర్వాత ఆయన్ను కూటమి నుంచి బీజేపీ దూరంపెట్టింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి