
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రస్తుతం అంటార్కిటికాలో ఉష్ణోగ్రత సుమారు -48 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నప్పటికీ.. తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి నిర్వహిస్తున్న Special Campaign for Disposal of Pending Matters (SCDPM) 6లో భాగంగా 45వ భారత అంటార్కిటిక్ శాస్త్రీయ యాత్ర (ISEA)కు చెందిన శీతాకాల బృందాలు మైత్రి, భారతి స్టేషన్లలో పరిశుభ్రత, స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంటార్కిటికా వంటి అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ పరిశుభ్రమైన, క్రమబద్ధమైన, మెరుగ్గా నిర్వహించబడే కార్యాలయాల పట్ల భారత బృందాల నిబద్ధత కొనసాగుతోందని పేర్కొంది.
45వ భారత అంటార్కిటిక్ శాస్త్రీయ యాత్రకు భారత వాతావరణ విభాగానికి చెందిన సైంటిఫిక్ ఆఫీసర్ హుయిడ్రోమ్ నాగేశ్వర్ సింగ్ నాయకత్వం వహించారు. భారతి స్టేషన్‌లోని శీతాకాల బృందంలో ముగ్గురు భారతీయ మహిళలు ఉన్నారు. వీరిలో ఇద్దరు శాస్త్రవేత్తలు కాగా.. మరొకరు వైద్యురాలు. వేసవి బృందం కీలక కార్యకలాపాలను పూర్తి చేసిన అనంతరం శీతాకాల బృందం బాధ్యతలు స్వీకరించింది. వీటిలో సరుకు రవాణా, యూఏఈలోని ఖలీఫా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో అంతర్జాతీయ శాస్త్రీయ సహకారం, సముద్ర పరిశోధనకు సంబంధించిన ఓషనోగ్రాఫిక్ ఫ్లోట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
భారత్ అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తొలి శాశ్వత పరిశోధనా కేంద్రాల్లో మైత్రి ఒకటి. ఇది 1988లో షిర్మాచర్ ఒయాసిస్‌లోని మంచురహిత రాతి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ భవనం స్టీల్ స్టిల్ట్స్‌పై నిర్మించబడింది. సముద్ర తీరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. మధ్య డ్రోనింగ్ మౌడ్ ల్యాండ్‌లోని ప్రముఖ పర్వత శ్రేణులకు వెళ్లేందుకు మైత్రి ఒక ప్రవేశ ద్వారంలా కూడా ఉపయోగపడుతుంది. మైత్రి ప్రధాన భవనంలో వేసవి, శీతాకాలాల్లో కలిపి సుమారు 25 మందికి వసతి కల్పించవచ్చు. వేసవిలో కంటెయినర్ ఆధారిత వసతి మాడ్యూళ్లతో కలిపి మొత్తం సామర్థ్యం సుమారు 40 మందికి ఉంటుంది. స్టేషన్‌లో ప్రధాన భవనం, ఇంధన నిల్వ ప్రాంతం, ఫ్యూయల్ స్టేషన్, సరస్సు నీటి పంప్‌హౌస్, సమ్మర్ క్యాంప్, పలు చిన్న కంటెయినర్ మాడ్యూళ్లు ఉన్నాయి. ప్రధాన భవనంలో నియంత్రిత విద్యుత్ సరఫరా, ఆటోమేటెడ్ హీటింగ్, వేడి-చల్లని నీటి సదుపాయం, ఇన్సినరేటర్ టాయిలెట్లు, కోల్డ్ స్టోరేజ్, పీఏ సిస్టమ్, నివాస, భోజన, విశ్రాంతి సదుపాయాలు, ప్రయోగశాల స్థలాలు ఉన్నాయి. భారత ప్రధాన భూభాగంతో వాయిస్, వీడియో, డేటా కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక శాటిలైట్ ఛానళ్లను ఉపయోగిస్తున్నారు.
మైత్రికి సుమారు 3,000 కిలోమీటర్ల తూర్పున, అంటార్కిటికాలోని తూర్పు స్టోర్నెస్ ద్వీపకల్పంలో భారతి పరిశోధనా కేంద్రం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 35 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ స్టేషన్‌ను 2012 మార్చి 18న ప్రారంభించారు. భారతి స్టేషన్‌ను ఏడాది పొడవునా శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేందుకు అనువుగా నిర్మించారు. ప్రధాన భవనంలో వేసవి, శీతాకాలాల్లో కలిపి 47 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉంది. అదనంగా వేసవి కాలంలో అత్యవసర షెల్టర్లు, సమ్మర్ క్యాంప్‌లలో మరో 25 మందికి వసతి కల్పించవచ్చు. దీంతో మొత్తం సామర్థ్యం 72 మందికి చేరుతుంది. భారతి స్టేషన్‌లో ప్రధాన భవనం, ఫ్యూయల్ ఫార్మ్, ఫ్యూయల్ స్టేషన్, సముద్రపు నీటి పంప్‌హౌస్, సమ్మర్ క్యాంప్, పలు కంటెయినర్ మాడ్యూళ్లు ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ సరఫరా, ఆటోమేటెడ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్, వేడి-చల్లని నీరు, ఫ్లష్ టాయిలెట్లు, సౌనా, కోల్డ్ స్టోరేజ్, పీఏ సిస్టమ్, నివాస, భోజన, లాంజ్, ప్రయోగశాల సదుపాయాలు ఉన్నాయి. ప్రత్యేక శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా భారత ప్రధాన భూభాగంతో నిరంతర సంబంధాలు కొనసాగుతున్నాయి. -48 డిగ్రీల చలిలోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. స్వచ్ఛ భారత్ సందేశం దేశ సరిహద్దులను దాటి ప్రపంచంలోని అత్యంత ప్రతికూల వాతావరణ ప్రాంతాల్లోనూ కొనసాగుతోందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.