బుజ్జి ఏనుగు ప్రాణాలు కాపాడేందుకు అనంత్ అంబానీ సాయం.. స్పెషల్ ఫ్లైట్‌లో ఎయిర్‌లిఫ్ట్..

అప్పుడే కళ్లు తెరిచిన ఆ చిన్న ప్రాణానికి కన్నతల్లి భయమే శాపంగా మారింది. భయంతో తల్లి ఏనుగు తన్నడంతో అప్పుడే పుట్టిన గున్న ఏనుగు తొడ ఎముక విరిగిపోయింది. గత ఏడు వారాలుగా నొప్పితో విలవిలలాడుతున్న రాజాకు కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు అనంత్ అంబానీ వంతారా టీమ్ రంగంలోకి దిగింది. 2,500 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి ప్రత్యేక విమానంలో తరలిస్తోంది.

బుజ్జి ఏనుగు ప్రాణాలు కాపాడేందుకు అనంత్ అంబానీ సాయం.. స్పెషల్ ఫ్లైట్‌లో ఎయిర్‌లిఫ్ట్..
Baby Elephant Raja Airlifted

Updated on: Nov 20, 2026 | 4:36 PM

పుట్టిన కొద్దిసేపటికే గున్న ఏనుగుకు ఊహించని కష్టం ఎదురైంది. కన్నతల్లి భయంతో తన్నడంతో దాని కుడి తొడ ఎముక విరిగిపోయింది. అప్పటి నుంచి నరకయాతన అనుభవిస్తున్న ఏడు వారాల రాజా అనే గున్న ఏనుగును కాపాడేందుకు అనంత్ అంబానీకి చెందిన వంతారా సంస్థ ముందుకొచ్చింది. మెరుగైన వైద్యం కోసం అస్సాం నుండి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. అస్సాంలోని గోగాముఖ్‌లో 2026 అక్టోబర్ 2న ఈ గున్న ఏనుగు జన్మించింది. దీనికి రాజా అని పేరు పెట్టారు. అయితే ప్రసవం జరిగిన కొద్దిసేపటికే 11 ఏళ్ల తల్లి ఏనుగు తీవ్ర భయాందోళనకు గురై, అప్పుడే పుట్టిన బిడ్డను గట్టిగా తన్నింది. ఈ ఘటనలో రాజా కుడి వెనుక కాలు తొడ ఎముక పూర్తిగా విరిగిపోయింది. దీంతో అది కనీసం నిలబడలేని స్థితికి చేరుకుంది. పైగా పుట్టిన వెంటనే తాగాల్సిన తల్లి ముర్రుపాలు కూడా అందకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది.

ఏడు వారాల చికిత్స.. క్షీణించిన ఆరోగ్యం

అక్టోబర్ 8న సమాచారం అందుకున్న వంతారా టీమ్ అక్కడికి చేరుకుని ఎక్స్-రే తీసి, విరిగిన కాలికి ప్లాస్టర్ కట్టు వేసింది. అక్టోబర్ 10న దానిని పోహుమారాలోని యజమాని నివాసానికి తరలించి, కాలిపై బరువు పడకుండా కదిలేందుకు ప్రత్యేకంగా హైడ్రోథెరపీ కొలనును కూడా నిర్మించారు. అయితే ఎక్కువ రోజులు ఒకేవైపు పడుకోవడం వల్ల శరీరంపై పుండ్లు పడటంతో పాటు విరేచనాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, లో-బ్లడ్ షుగర్, కాలేయ సమస్యలు తలెత్తాయి. బొడ్డు వద్ద హెర్నియా కూడా గుర్తించడంతో పరిస్థితి విషమించింది.

2,500 కిలోమీటర్ల ప్రయాణం.. ప్రత్యేక విమానం ఏర్పాటు

అస్సాం నుండి జామ్‌నగర్‌కు రోడ్డు మార్గంలో తరలించాలంటే 2,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. కాలు విరిగిన స్థితిలో అంత దూరం రోడ్డు ప్రయాణం ప్రాణాంతకమని భావించిన వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ.. గౌహతి నుండి జామ్‌నగర్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. కేవలం నాలుగు గంటల్లోనే ఈ ప్రయాణం పూర్తవుతుంది. విమానంలో రాజా కాలికి ఎలాంటి కదలిక లేకుండా మెత్తని పరుపులతో కూడిన ప్రత్యేక బోనును సిద్ధం చేశారు. ప్రయాణమంతా వైద్యుల బృందం దాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది.

జీవితాంతం వైద్య పర్యవేక్షణ

“రాజా విరిగిన కాలితో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు కానీ దాని ఆత్మస్థైర్యం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు” అని వంతారా సీఈఓ వివాన్ కరణి పేర్కొన్నారు. జామ్‌నగర్ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత రాజాకు ప్రత్యేక ఎముకల చికిత్స, పౌష్టికాహారం, పునరావాస సేవలు అందించనున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా దానికి జీవితాంతం వైద్య పర్యవేక్షణ అవసరమయ్యే అవకాశం ఉందని వంతారా వెల్లడించింది.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us