Tomato Flu: చిన్నారులను వెంటాడుతున్న టమాటా ఫ్లూ.. ఒకేరోజు 26మందికి పాజిటివ్‌.. ఎక్కడంటే!

| Edited By: Ravi Kiran

May 25, 2022 | 7:29 AM

Tomato Flu Causes: కరోనా, ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్‌లు..ఇలా రోజుకో వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఐతే తాజాగా టమాటా ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

Tomato Flu: చిన్నారులను వెంటాడుతున్న టమాటా ఫ్లూ.. ఒకేరోజు 26మందికి పాజిటివ్‌.. ఎక్కడంటే!
Tomato Flu
Follow us on

నిన్న కేరళ..ఇవాళ ఒడిశా. చిన్నారులను వెంటాడుతోంది టమాటా ఫ్లూ. మొన్నటివరకు కేరళను వణికించిన ఈ ఫ్లూ..ఇప్పుడు ఒడిశాపై పంజా విసురుతోంది. ఒక్కరోజే 26 కేసులు బయటపడటం టెన్షన్‌ పెడుతోంది. కరోనా సృష్టించిన విలయం నుంచే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రోజుకో కొత్త స్ట్రెయిన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా, ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్‌లు..ఇలా రోజుకో వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఐతే తాజాగా టమాటా ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే ప్రారంభంలో కేరళలో వెలుగుచూసిన ఈ టమాటా ఫ్లూ..ఇప్పుడు ఒడిశాలో దడ పుట్టిస్తోంది. HFMDగా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్​ రీసెర్చ్ సెంటర్​లో..36 నమూనాలను పరీక్షించగా..26మందికి పాజిటివ్‌గా తేలింది.

చిన్నారుల చేతులు, పాదాలు, నోరు, పెదవుల మీద టమాటో ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వారిని ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉంచామని..వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు . ఏడు రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. టమాటా ఫ్లూ అని పిలిచే ఈ అంటు వ్యాధి పేగు వైరస్‌ల వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా చిన్నారుల్లోనే వస్తుంది. పెద్దవారిలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నెల మొదట్లోనే కేరళలోని కొల్లం జిల్లాలో 80 మందిచిన్నారులు టమాట ఫ్లూ బారినపడ్డారు. దీంతో పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశాయి. మరోవైపు ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న మంకీ పాక్స్‌..మనదేశంలో ఇంకా ఎంట్రీ ఇవ్వనప్పటికీ కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది మహారాష్ట్ర సర్కారు. ముంబైలో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది.