
ఉత్తరప్రదేశ్‌లోని డియోబంద్‌లో 11 ఏళ్ల క్రితం జరిగిన మహిళపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరానికి పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కఠిన శిక్ష విధించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ బ్రజ్‌మోహన్ యాదవ్, సబ్‌ఇన్‌స్పెక్టర్ వేగ్‌పాల్ సింగ్‌లకు చెరో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా కూడా విధించింది.
అసలేం జరిగింది?
ఈ ఘటన 2015 ఆగస్టు 6న చోటుచేసుకుంది. తన భర్త అరెస్టు కావడంతో ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ఓ మహిళ డియోబంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడి అప్పటి ఎస్‌హెచ్‌ఓతో సహా నలుగురు పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలితో పాటు ఉన్న మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీబీఐ విచారణతో వెలుగులోకి కేసు
స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించారు. సీబీఐ దాఖలు చేసిన తుది నివేదికను బాధితురాలు నిరసన పిటిషన్ ద్వారా సవాలు చేశారు. అనంతరం న్యాయపోరాటం కొనసాగింది.
శిక్ష తగ్గించాలన్నా అంగీకరించని కోర్టు
దోషుల వయస్సును పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని వారి తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. అత్యాచారం కేసులో ఐపీసీ సెక్షన్ 376D కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, సెక్షన్ 506 కింద ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 11 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడిన బాధితురాలు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, దోషులకు జీవిత ఖైదు విధించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. శిక్షను పెంచడంతో పాటు బాధితురాలికి మరింత పరిహారం అందించాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ఆమె తరఫు న్యాయవాది రాజీవ్ తోమర్ వెల్లడించారు. ఈ కేసులో మరో పోలీసు అధికారి, కానిస్టేబుల్‌కు సంబంధించిన అంశాలపై కూడా న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత వెలువడిన ఈ తీర్పు ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..