
ఇంటర్నెట్ లో దీనికి ‘షిఫ్ట్ సల్కింగ్’ అనే పేరు పెట్టారు. అంటే ఒక ఉద్యోగి శారీరకంగా ఆఫీసులో ఉన్నా.. మానసికంగా మాత్రం ఆ పనిలో ఉండడు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఒకరి నుంచి మరొకరికి వైరస్ లా వ్యాపించే ప్రమాదకరమైన మానసిక స్థితి. అసలు ఈ ట్రెండ్ ఎందుకు వస్తోంది? దీనివల్ల కంపెనీలకు వచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం..
క్లారిఫై క్యాపిటల్ సీఈఓ మైఖేల్ బేన్స్ దీనిని ‘క్వైట్ క్విటింగ్ 2.0’ అని పిలుస్తున్నారు. దీనిని ఆయన “యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్” అని అభివర్ణించారు. అంటే ఉద్యోగి తన డ్యూటీకి హాజరవుతాడు కానీ, ఎమోషనల్ గా ఆ పని నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాడు. ఉదయాన్నే లాగిన్ అవ్వగానే అలసిపోయినట్లు అనిపించడం అనేది కేవలం నిద్ర లేకపోవడం వల్ల వచ్చేది కాదు. ల్యాప్‌టాప్ ముందు కూర్చుని భోజనం చేయడం, మీటింగ్స్ అంటే భయం, నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల కలిగే మానసిక ఆందోళన ఇది.
వర్క్ ప్లేస్ అనేది ఒక ఎకో సిస్టమ్ లాంటిది. ఒక వ్యక్తి తక్కువ బ్యాటరీతో (నీరసంగా) పని మొదలుపెడితే, ఆ నెగటివ్ ఎనర్జీ ఆ గదిలో ఉన్న అందరికీ పాకుతుంది. దీనినే నిపుణులు ‘ఎమోషనల్ కాంటాజియన్’ అని పిలుస్తారు. మనుషులు సహజంగానే ఎదుటివారి మూడ్‌ను ప్రతిబింబిస్తారు. కాబట్టి ఒక టీమ్‌లో ఒక్కరు చిరాగ్గా ఉన్నా, ఆ ప్రభావం టీమ్ ప్రొడక్టివిటీ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మీద పడుతుంది. ఇది వ్యాపారానికి కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. జెన్ జీ, మిలీనియల్స్ మధ్య ఈ షిఫ్ట్ సల్కింగ్ ఎక్కువగా కనిపిస్తోంది.
దీనికి ప్రధాన కారణం ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’. అంటే.. పని గంటల్లో స్పష్టత లేకపోవడం, తక్కువ మందితో ఎక్కువ పని చేయించడం, పై అధికారుల నుంచి సరైన మద్దతు లేకపోవడం, వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిళ్లు కూడా దీనికి తోడవుతాయి. యూత్ ఇప్పుడు మెంటల్ స్టెబిలిటీకి, బౌండరీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పని కోసం ప్రాణాలు ఇచ్చే సంస్కృతిని వారు ఇష్టపడటం లేదు. కానీ ఆఫీస్ వాతావరణం అందుకు తగ్గట్టుగా మారనప్పుడు ఇలాంటి నిరసనలు ‘సల్కింగ్’ రూపంలో బయటకు వస్తాయి.
షిఫ్ట్ సల్కింగ్ అనేది ఒక టాక్సిక్ కల్చర్ గా మారకముందే కంపెనీలు మేల్కోవాలి. దీనికి షార్ట్ కట్ మంత్రాలు ఏమీ లేవు. ముందుగా ఉద్యోగులు బర్న్ అవుట్ కు గురవుతున్నారని అంగీకరించాలి. పని ఒత్తిడి గురించి స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఉండాలి. పనిని ఎంజాయ్ చేసేలా ఆఫీస్ ఎన్విరాన్‌మెంట్ ను మార్చాలి. మనం చేసే పనిని ఇష్టపడితే, వ్యక్తిగత జీవితంలో ఉండే చిన్న చిన్న ఒత్తిళ్లు కూడా పెద్దగా అనిపించవు. ఆఫీస్ కు రాగానే చిరాకు పడకుండా, ఉత్సాహంగా పనిని మొదలుపెట్టే రోజు కోసం మేనేజ్ మెంట్, ఎంప్లాయ్ ఇద్దరూ కలిసి కృషి చేయాలి. ఆఫీసులో షిఫ్ట్ సల్కింగ్ అనేది కేవలం ఒక వ్యక్తి మూడ్ మాత్రమే కాదు, అది ఆ సంస్థ యొక్క ఆరోగ్యానికి సూచిక. పని చేసే చోట ప్రశాంతత లేకపోతే, ఎంత జీతం వచ్చినా అది వృథానే.