
అందమైన, మెరిసే చర్మం కోసం చాలామంది ఇంట్లోనే రకరకాల చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యంగా విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కట్ చేసి, దానిలోని నూనెను నేరుగా ముఖానికి రాసుకోవడం లేదా ఇతర ఫేస్ ప్యాక్‌లలో కలిపి వాడటం ఈమధ్య బాగా పెరుగుతోంది. అయితే, ఇలా విటమిన్ ఇ క్యాప్సూల్‌ను నేరుగా చర్మానికి పూయడం నిజంగానే మంచిదేనా? దీనిపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ ఏమంటున్నారో తెలుసుకుందాం.
డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ తెలిపిన వివరాల ప్రకారం, విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుందనేది వాస్తవమే అయినా, క్యాప్సూల్‌ను కట్ చేసి నేరుగా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి పోషణ అందదు. విటమిన్ ఇ చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకెళ్లడానికి వీలుగా ప్రత్యేకమైన సాల్వెంట్లు, ఎమల్సిఫైయర్లు అవసరమవుతాయి. ఇవి చర్మ సంరక్షణ క్రీమ్‌లు లేదా మోయిశ్చరైజర్లలో మాత్రమే ఉంటాయి. క్యాప్సూల్‌లోని నూనె నేరుగా చర్మంపై ఇంకిపోలేదని ఆమె స్పష్టం చేశారు.
రంధ్రాలు మూసుకుపోవడం: విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని ఆయిల్ చాలా జిడ్డుగా, చిక్కగా ఉంటుంది. దీన్ని నేరుగా రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి ముఖంపై పింపుల్స్, ఆక్నె సమస్యలు పెరుగుతాయి.
అలర్జీలు, మంట: సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ నూనెను నేరుగా వాడితే ముఖం ఎర్రబడటం, దురద, మంట లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
విటమిన్ E మోయిశ్చరైజర్లు: చర్మానికి విటమిన్ ఇ అందాలంటే, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే మోయిశ్చరైజర్లు లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
వైద్యుల సలహా: శరీరానికి విటమిన్ ఇ లోపం ఉన్నట్లయితే, నిపుణుల సలహా మేరకు ఆ క్యాప్సూల్స్‌ను మాత్రల రూపంలో మింగవచ్చని, కానీ, ముఖానికి పూయకూడదని డాక్టర్ పంత్ వివరించారు. అందుకే, సోషల్ మీడియా చిట్కాలను గుడ్డిగా నమ్మకుండా, చర్మానికి ఏది సురక్షితమో తెలుసుకుని వాడటం ఎంతో ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..