Moral Story: గర్వంతో అవమానిస్తే జరిగేది ఇదే.. సింహం – చిట్టెలుక కథ

చిన్నవారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. దయ, వినయం మనిషిని గొప్పవాడిని చేస్తాయి. ఈరోజు చేసిన మంచి పని, రేపు మనకు సహాయంగా తిరిగి వస్తుంది. ఇలాంటి విలువలు పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలంటే వారికి ఆసక్తికరంగా ఉండే కథలను వినిపించాలి. అలాంటిదే ఈ కింది సింహం- చిట్టెలుక కథ..

Moral Story: గర్వంతో అవమానిస్తే జరిగేది ఇదే.. సింహం - చిట్టెలుక కథ
Lion And Mouse Story

Updated on: Jul 06, 2026 | 6:06 PM

అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక బలమైన సింహం నివసించేది. అది అడవికి రాజు. ఒక రోజు వేటకు వెళ్లి అలసిపోయిన సింహం ఒక పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ గాఢ నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో ఒక చిన్న చిట్టెలుక అక్కడికి వచ్చింది. అది చాలా చురుకుగా ఉండేది. ఆడుకుంటూ, పరుగులు తీస్తూ ఉండగా అనుకోకుండా నిద్రపోతున్న సింహం మీదకు ఎక్కింది. సింహం శరీరంపై పరుగులు తీస్తూ గెంతులు వేయసాగింది. దీంతో సింహం నిద్రభంగమై ఒక్కసారిగా మేల్కొంది. కోపంతో తన పెద్ద పంజాతో చిట్టెలుకను పట్టుకుంది.

భయంతో వణికిపోయిన చిట్టెలుక, ‘మహారాజా! నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు. ఈసారి నన్ను విడిచిపెడితే మీ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. అవకాశం వస్తే మీకు సహాయం కూడా చేస్తాను’ అని వేడుకుంది. చిట్టెలుక మాటలు విన్న సింహం నవ్వింది. ‘నువ్వు చిన్నదానివి. నాకెలా సహాయం చేస్తావు?’ అని అడిగింది. అయినప్పటికీ దయతో చిట్టెలుకను విడిచిపెట్టింది. చిట్టెలుక సింహానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కొన్ని రోజుల తరువాత కొందరు వేటగాళ్లు అడవికి వచ్చారు. వారు సింహాన్ని పట్టుకోవడానికి ఒక బలమైన వల పన్నారు. తెలియక ఆ దారిలో వెళ్లిన సింహం ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం పిలిచింది. ఆ గర్జన విన్న చిట్టెలుక వెంటనే అక్కడికి చేరుకుంది. సింహం వలలో చిక్కుకుని బాధపడుతున్నదని చూసి, “మహారాజా! భయపడకండి. నేను మిమ్మల్ని రక్షిస్తాను” అని చెప్పింది. వెంటనే తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరకడం ప్రారంభించింది. కొంతసేపు కష్టపడి అన్ని తాళ్లను తెంచేసింది. చివరకు సింహం వల నుంచి బయటపడింది.

సింహం ఎంతో సంతోషించింది. ‘నిన్ను చిన్నదానివని తక్కువగా అంచనా వేశాను. కానీ ఈరోజు నీ సహాయం వల్లనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. అని చెప్పింది. చిట్టెలుక చిరునవ్వుతో, ‘ఎవరినీ చిన్నవారిగా చూడకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని చెప్పింది. ఆ రోజు నుంచి సింహం మరియు చిట్టెలుక మంచి స్నేహితులుగా జీవించాయి.

నీతి

చిన్నవారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. మేలు చేసిన వారికి ఒక రోజు తప్పకుండా వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us