
వంకాయ కూర అనగానే చాలామందికి నోరు ఊరుతుంది. సాధారణంగా చేసే వంకాయ కూరలకు భిన్నంగా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే, రెండు ముద్దలు ఎక్కువ తినించే వంకాయ కూర రెసిపీని తయారు చేయండి. ఈ వంటకాన్ని ఎలా తయారుచేయాలో వివరంగా చూద్దాం..
ముందుగా లేతగా, తాజాగా ఉండే వంకాయలను తీసుకోవాలి. వాటి కాడలను కత్తిరించి శుభ్రంగా కడగాలి. ప్రతి వంకాయకు నిలువుగా రెండు లేదా మూడు గాట్లు (వంకాయ పరిమాణాన్ని బట్టి) పెట్టాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు త్వరగా ఉడకడమే కాకుండా, మసాలా లోపలికి వెళ్లి రుచిగా ఉంటాయి. పుచ్చులు, పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. గాట్లు పెట్టిన వంకాయలకు చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, ఐదు ఆరు చుక్కల నూనె వేసి చేత్తో బాగా రుద్ది పట్టించాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గి, రుచి పెరుగుతుంది. వంకాయలు నల్లబడకుండా వెంటనే వండడం మొదలుపెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక, మ్యారినేట్ చేసిన వంకాయలను ఒక్కొక్కటిగా కడాయిలో బోర్లించి పెట్టాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత, మరోవైపుకు తిప్పి రెండువైపులా సుమారు 60% మగ్గే వరకు వేయించాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు మెత్తగా, వెన్నలా కరిగిపోయేలా తయారవుతాయి. వేయించిన వంకాయలను ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి చిటపటమనే వరకు వేయించాలి. తర్వాత రెండు పచ్చిమిరపకాయలను తుంచి వేయాలి. ఒక మధ్యస్థాయి ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ముందుగా తయారుచేసుకున్న రెండు టొమాటోల ప్యూరీని (లేదా సన్నగా తరిగిన టొమాటో ముక్కలను) వేసి పచ్చిదనం పోయి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత కారం (మ్యారినేట్ చేసినప్పుడు వేసిన కారాన్ని బట్టి), అర టేబుల్ స్పూన్ ధనియా-జీరా పొడి వేసి, స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపాలి. మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించినట్లయితే మసాలాలు బాగా కలిసి నూనె పైకి తేలుతుంది.
ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను గ్రేవీలో వేయాలి. వంకాయ ముక్కలు విరగకుండా నెమ్మదిగా కలిపి, గ్రేవీ వంకాయలకు బాగా పట్టించాలి. వంకాయలు మ్యారినేట్ చేసిన ప్లేట్ లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి, ఆ నీటిని కూరలో కలపాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టి, ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించినట్లయితే నూనె పైకి తేలి, సువాసనతో కూడిన వంకాయ కూర సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నంతో, చపాతీతో లేదా రోటీతో ఈ వంకాయ కూరను ఆస్వాదించండి. ఈ రుచికరమైన కూర ఖచ్చితంగా మీ ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది.