
ఒకరోజు ఓ అబ్బాయి తన తండ్రిని అడిగాడు. నాన్నా.. నా జీవితానికి అసలు ఎంత విలువ ఉంది? అడిగాడు ఏడేళ్ల వయసున్న కొడుకు. ఆ ప్రశ్న విన్న తండ్రి వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపు నవ్వి, ఒక రంగురంగుల రాయిని తీసుకుని తన కొడుక్కి ఇచ్చాడు. ‘నిజంగా నీ జీవిత విలువ తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ రాయిని తీసుకుని మార్కెట్‌కు వెళ్లు. ఎవరైనా దీని ధర ఎంత అని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకు. కేవలం నీ రెండు వేళ్లు మాత్రమే చూపించు’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లే ఆ అబ్బాయి రాయిని తీసుకుని మార్కెట్‌కు వెళ్లాడు. కొంతసేపు అక్కడే నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటికి ఓ పెద్దావిడ అతడి దగ్గరకు వచ్చింది. అతడి చేతిలో ఉన్న రాయిని చూసి ఆసక్తిగా అడిగింది. ‘బాబూ.. ఈ రాయి ఎంత?’ అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. తండ్రి చెప్పినట్లు రెండు వేళ్లు చూపించాడు.
ఆ పెద్దావిడ వెంటనే.. ‘200 రూపాయలా? సరే.. నేను కొనుక్కుంటాను’ అంది. ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘సాధారణంగా కనిపించే ఈ రాయికి 200 రూపాయల విలువ ఉందా?’ అని అనుకుంటూ వెంటనే ఇంటికి వెళ్లి తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. తండ్రి నవ్వుతూ అన్నాడు.. ‘ఇప్పుడు ఈ రాయిని ఒక మ్యూజియంకు తీసుకెళ్లు. అక్కడ కూడా ఎవరైనా ధర అడిగితే ఏమీ చెప్పకుండా రెండు వేళ్లు చూపించు.’ అబ్బాయి మ్యూజియంకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి ఆ రాయిని చూసి చాలా ఆసక్తిగా దగ్గరకు వచ్చాడు. ‘ఈ రాయి ఎంతకు ఇస్తావు?’ అని అడిగాడు. అబ్బాయి మళ్లీ రెండు వేళ్లు చూపించాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా… ‘20,000 రూపాయలా? సరే.. నేను 20,000 రూపాయలు ఇస్తాను. ఈ రాయి నాకు ఇవ్వు’ అన్నాడు. ఈసారి అబ్బాయి మరింత షాక్ అయ్యాడు. అదే రాయి.. మార్కెట్‌లో 200 రూపాయలు. ఇప్పుడు మ్యూజియంలో 20,000 రూపాయలు! అతడు పరుగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు తండ్రి మరోసారి చిరునవ్వుతో.. ‘ఇంకా చివరిగా ఒక చోటుకు వెళ్లు. విలువైన వజ్రాలు, అరుదైన రత్నాలు అమ్మే దుకాణానికి ఈ రాయిని తీసుకెళ్లు. అక్కడ కూడా ఎవరైనా ధర అడిగితే రెండు వేళ్లు మాత్రమే చూపించు’ అన్నాడు.
అబ్బాయి వెంటనే ఓ విలువైన రత్నాల దుకాణానికి వెళ్లాడు. కౌంటర్ వెనుక ఉన్న ఓ వృద్ధుడు ఆ రాయిని చూశాడు. ఆయన కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. వెంటనే కౌంటర్ బయటకు వచ్చి ఆ రాయిని చేతిలోకి తీసుకుని పరిశీలించాడు. ‘ఓ మై గాడ్! ఈ రాయిని నేను చాలా కాలంగా వెతుకుతున్నాను. ఇది చాలా అరుదైనది! ఎక్కడ దొరికింది నీకు? దీని ధర ఎంత?’ అని ఆత్రుతగా అడిగాడు. అబ్బాయి మళ్లీ ఏమీ మాట్లాడకుండా రెండు వేళ్లు చూపించాడు. వృద్ధుడు వెంటనే.. ‘2 లక్షల రూపాయలా? సరే! నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను. దయచేసి ఈ రాయిని నాకు ఇవ్వు’ అన్నాడు. అబ్బాయి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అదే రాయి.. మార్కెట్‌లో రూ.200. మ్యూజియంలో రూ.20,000. రత్నాల దుకాణంలో రూ.2 లక్షలు! వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ తన కొడుకుతో ఇలా అన్నాడు..
‘ఇప్పుడు అర్థమైందా నీ జీవిత విలువ? ఈ రాయి ఎక్కడికి వెళ్లినా మారలేదు. అది అదే రాయి. కానీ దాన్ని చూసే వారి అవగాహన, దాని అసలైన విలువను గుర్తించే వారి స్థాయి మారింది. అందుకే ఒక్కో చోట ఒక్కో ధర పలికింది. నీ జీవితం కూడా అంతే. నీ విలువను ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారో నిర్ణయించదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ సామర్థ్యాన్ని ఎవరు గుర్తిస్తున్నారు, ముఖ్యంగా నిన్ను నువ్వు ఎంత విలువైన వ్యక్తిగా భావిస్తున్నావు అన్నదే ముఖ్యం. 200 రూపాయల విలువ ఉన్న చోటే ఉండాలా? లేక నీ అసలైన సామర్థ్యాన్ని గుర్తించే చోట నిలబడాలా? అది నువ్వే నిర్ణయించుకోవాలి’ అని అన్నాడు.
జీవితంలో మనల్ని ప్రేమించే, గౌరవించే, మన విలువను గుర్తించే వారు ఉంటారు. కానీ కొందరు మనల్ని తమ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని చూస్తారు. అలాంటి వారి ప్రవర్తన ఆధారంగా మన విలువను నిర్ణయించుకోవడం తప్పు. మీ విలువ, మీ సామర్థ్యం, మీ వ్యక్తిత్వం ఇతరుల మాటలతో తగ్గిపోవు. కొన్ని చోట్ల మీ ప్రతిభను గుర్తించకపోవచ్చు. దానర్థం మీలో ప్రతిభ లేదని కాదు. సరైన చోటు, సరైన అవకాశం, మీ అసలైన విలువను గుర్తించే వ్యక్తులు దొరకకపోవడమే కావచ్చు. రిలేషన్‌షిప్‌లో అయినా, ఉద్యోగంలో అయినా, జీవితంలో ఏ రంగంలో అయినా.. మీ విలువను మీరు తెలుసుకోండి. మిమ్మల్ని గౌరవించని చోట మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీ సామర్థ్యాన్ని గుర్తించని వారి కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఎప్పుడూ తక్కువగా అమ్ముడుపోవద్దు. మీ అసలైన విలువ ఏమిటో ముందుగా మీరు తెలుసుకోండి.. ఆ విలువను ప్రపంచానికి తెలిసేలా చేయండి. మీ విలువను ఇతరులు నిర్ణయించరు.. నిన్ను నువ్వు ఎక్కడ నిలబెట్టుకుంటావో, నీ సామర్థ్యాన్ని ఎంతగా పెంచుకుంటావో అదే నీ అసలైన విలువను నిర్ణయిస్తుంది.