
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సరైన పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి.. పండ్లు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అటువంటి పోషక విలువలున్న పండ్లలో బొప్పాయి ప్రధానమైనది. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయి మన శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మార్కెట్లో లభించే అనేక ఫేస్ క్రీమ్‌లు, ఫేస్ వాష్‌లలో బొప్పాయిని ఉపయోగించడం దీనికి నిదర్శనం. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అలాగే మొటిమలు, ముడతలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఇంట్లో బొప్పాయి పండును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.
శరీరంలోని ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచడంలో బొప్పాయి అత్యంత ప్రభావవంతమైనది. డెంగ్యూ వంటి అనారోగ్య సమస్యలలో ప్లేట్‌లెట్స్ తగ్గడం సర్వసాధారణం. అటువంటి సమయాల్లో బొప్పాయి పండు లేదా బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ గణనీయంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి కేవలం ప్లేట్‌లెట్స్ మాత్రమే కాకుండా, అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్న పండు.
బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ పండు. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ప్రతిరోజు బొప్పాయిని తినడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయని చెబుతారు.
బొప్పాయిలో మెగ్నీషియం, ఐరన్, మినరల్స్, పొటాషియం, ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియను మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ ఎ, బి, సి లు ఉండటం వల్ల చర్మ ఆరోగ్యంతో పాటు శరీరానికి, చిగుళ్ల ఆరోగ్యానికి కూడా బొప్పాయి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు బొప్పాయిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..