
భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో వట్టి తునకల మటన్ కూర ఒక విశిష్టమైన, సాంప్రదాయక బలవర్ధక వంటకం.. పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉండే వట్టితునకలు.. కేవలం నోరూరించే రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.. ఎండబెట్టిన మాంసంతో తయారుచేసే ఈ వంటకాన్ని ఎండబెట్టిన యాట మాంసం కూర (ఎండు మాంసం) అని కూడా పిలుస్తారు. ఇది బాలింతలకు, శారీరక శ్రమ చేసేవారికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. నరాల బలహీనతను దూరం చేసి.. శరీరాన్ని ఉక్కులా మారుస్తుందని పేర్కొంటారు పెద్దలు, ఆరోగ్య నిపుణులు..
వట్టి తునకల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.. అంతేకాకుండా.. ఐరన్, జింక్, విటమిన్ B12, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఎండు మాంసం కండరాల బలానికి ఉపయోగపడుతుంది. అలాగే.. రక్తహీనతను తగ్గించి, శరీరానికి అవసరమైన శక్తిని, స్టామినాని అందిస్తాయి.
నరాల బలహీనతను తగ్గించడంలో.. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఎముకలు గట్టిపడేందుకు వట్టితునకలు సహాయపడతాయి..
అందుకే.. పూర్వకాలం నుంచి వట్టితునకలను బలవర్ధక ఆహారంగా ఉపయోగించేవారు. ప్రసవం తర్వాత బాలింతలకు బలాన్నివ్వడానికి, పాల ఉత్పత్తిని పెంచడానికి వట్టితునకలు పెట్టేవారు.
పూర్వ కాలంలో దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కోలుకునేవారికి, బలహీనంగా ఉన్నవారికి, గాయాలతో బాధపడేవారికి ఈ వట్టి తునకల కూరను ఆహారంగా ఇచ్చేవారు. దీనివల్ల వారు త్వరగా కోలుకునే శక్తి లభించేదని చెబుతారు. అందుకే.. నెలకు ఒక్కసారైనా తినాలని చెబుతున్నారు.
ముందుగా, మటన్‌ను శుభ్రంగా కడిగి, ముక్కలలో నీరు లేకుండా పొడిగా చూసుకోవాలి. అనంతరం, ముక్కలను సరైన దూరంలో ఏర్పాటు చేసుకొని, నాలుగు నుంచి పదిహేను రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత వీటిని లోపలికి తీసుకువెళ్లి, మరుసటి రోజు మళ్ళీ ఎండలో ఆరబెట్టాలి. ఈ ప్రక్రియ ద్వారా మాంసం ముక్కలు గట్టిపడి ఐరన్ ముక్కల వలే మారతాయి. బాగా ఎండిన వట్టి తునకలను గట్టి మూత ఉన్న గాజు సీసాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు తాజాగా ఉంటాయి. ఈ సాంప్రదాయ వంటకం శారీరక ఆరోగ్యాన్ని, బలాన్ని పెంపొందించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
వట్టి తునకలను ఎలాగైనా వండుకోవచ్చు.. అవసరమైనప్పుడు టమాటా, దోసకాయ లేదా ఉల్లిపాయలతో కలిపి కూరగా వండుకోవచ్చు.. వట్టితునకల ఫ్రై కూడా అద్భుతంగా ఉంటుంది.