
తెలుగు సంప్రదాయ వంటకాల్లో పచ్చడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఆకుకూరలతో చేసే పచ్చళ్లు కేవలం రుచిని మాత్రమే కాకుండా, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి అద్భుతమైన వంటకాల్లో పొన్నగంటి ఆకు రోటి పచ్చడి ఒకటి.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో కలిపి తింటే, ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా పొన్నగంటి ఆకుతో పప్పు లేదా ఫ్రై వంటివి చేసుకుంటారు. అయితే, పచ్చడి రూపంలో దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవచ్చు.. తద్వారా అధిక పోషక విలువలను పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
పొన్నగంటి ఆకుకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, రైబోఫ్లవిన్ (బి2), నియాసిన్ (బి3)తోపాటు.. ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటికి ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు బీటా కెరోటిన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే.. శరీరానికి ఎన్నో పోషకాలను అందించే పొన్నగంటి కూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పొన్నగంటి ఆకు (Alternanthera లేదా Dwarf Copperleaf) అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం..
ఇలా ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొన్నగంటి ఆకుతో మనకు లభిస్తాయి.
ఈ పచ్చడిని తయారు చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక 1/4 టీస్పూన్ మెంతులు, ఒక టేబుల్‌స్పూన్ ధనియాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్స్పూన్ల నువ్వులు వేసి, మాడిపోకుండా చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తర్వాత కారానికి తగ్గట్టు నాలుగు ఎండుమిర్చి, ఆరు పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలపడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది. దినుసులన్నీ దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న 200 గ్రాముల పొన్నగంటి ఆకును వేసుకోవాలి. ఆకును లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి, ఆకులోని పచ్చి వాసన పోయి బాగా మగ్గే వరకు ఉడికించాలి. ఆకు మగ్గిన తర్వాత స్టవ్ ఆపి, పాన్‌ను పక్కకు దించి చల్లారనివ్వాలి.
ఇప్పుడు రోట్లో ముందుగా వేయించుకున్న దినుసులను వేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తగా దంచిన తర్వాత రెండు లేదా మూడు వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఆ తర్వాత నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా దంచాలి. చివరగా మనం మగ్గించుకున్న పొన్నగంటి ఆకును వేసి అంతా కలిసేలా బాగా దంచుతూ మిక్స్ చేయాలి. పచ్చడి తగిన కన్సిస్టెన్సీకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒకటి లేదా రెండు టేబుల్స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు (శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి) వేసి దోరగా వేయించాలి. కాస్త కరివేపాకు, ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆపి ఈ పోపును పచ్చడిలో వేసి బాగా కలపాలి.
అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పొన్నగంటి ఆకు రోటి పచ్చడి సిద్ధం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ సంప్రదాయక వంటకాన్ని ఇంట్లో తయారు చేసుకుని, దాని అద్భుతమైన రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..