
ఒంటికి చలువ చేసే, తక్షణ శక్తిని అందించే ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయం సగ్గుబియ్యం జావ.. తెలుగు రాష్ట్రాల్లో ఏ కాలంలోనైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు తరచుగా తయారుచేసే ఈ జావ శరీరానికి పోషణను అందించి, నీరసాన్ని తగ్గిస్తుంది. జ్వరం, మోషన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం నీరసించిపోతుంది. ఆ సమయంలో ఆహారం సరిగా తీసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో సగ్గుబియ్యం జావ తాగడం వల్ల త్వరగా శక్తిని పొంది, ఉపశమనం లభిస్తుంది.
సగ్గుబియ్యంలో కేలరీలతోపాటు.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వులు, కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీరాన్ని బలంగా మార్చి.. ఎనర్జీగా ఉండేటట్లు చేస్తాయి.. అందుకే.. రెగ్యులర్ గా సగ్గుబియ్యం (Sabudana) తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
ఈ కథనంలో సగ్గుబియ్యం జావ సింపుల్ గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సురక్షితమైనది, ప్రయోజనకరమైనది.
సగ్గుబియ్యాన్ని నానబెట్టడం: ముందుగా పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానితే త్వరగా ఉడుకుతాయి.
నీటిని మరిగించడం: అరగంట తరువాత, అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
సగ్గుబియ్యాన్ని ఉడికించడం: నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ మరుగుతున్న నీళ్లలో వేయాలి. ఒకసారి బాగా కలుపుకుని, సగ్గుబియ్యం సాఫ్ట్‌గా అయ్యేవరకు ఉడికించుకోవాలి. మూత పెడితే త్వరగా ఉడుకుతాయి, కానీ పూర్తిగా మూయకుండా కొద్దిగా పక్కకు పెడితే పొంగిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం త్వరగా అడుగంటుతుంది కాబట్టి మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
ఉడికినట్లు గుర్తించడం: సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారితే అవి ఉడికినట్లు. మీరు చేత్తో నొక్కి కూడా చూసుకోవచ్చు. అవి మెత్తగా ఉండాలి.
బెల్లం, ఇతర పదార్థాలు కలపడం: సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత, అందులో కప్పు తురిమిన బెల్లం, రెండు మూడు చిటికెలు ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేయాలి.
బెల్లం కరిగించడం: ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం బదులుగా పంచదార కూడా వాడుకోవచ్చు. ఈ జావ సాధారణంగా మైల్డ్‌గా తీయగా ఉంటుంది. మీకు తీయ్యగా కావాలంటే మరికొంచెం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జావలో పాలు పోయరండి, ఇలాగే తాగుతారు. కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా, తాగడానికి వీలుగా ఉండాలి. గోరువెచ్చగా లేదా వేడిగా తాగితే చాలా చాలా రుచిగా ఉంటుంది.
సగ్గుబియ్యం జావ తక్షణ శక్తిని అందించి, శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల నీరసం తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆహారం తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయాల్లో ఈ జావ వారికి అవసరమైన శక్తిని అందించి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది ఒక మంచి పానీయం. ఇంట్లో ఎప్పుడూ సగ్గుబియ్యం అందుబాటులో ఉంచుకుంటే, అవసరమైనప్పుడు త్వరగా ఈ ఆరోగ్యకరమైన జావను తయారుచేసుకోవచ్చు.
ఈ సులభమైన, పోషకమైన సగ్గుబియ్యం జావను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి, దాని రుచి, ప్రయోజనాలను అనుభవించండి. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.