
ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు మంచిగా.. మటన్, చికెన్, ఫిష్ కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా.. పలు రకాల పద్దతుల్లో ఇష్టంగా వండుకుని తింటారు. చాలామంది ఎక్కువగా చికెన్ ను కొనుగోలు చేస్తారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో కోడి కూరను ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టైల్ లో వండుకుంటారు. అయితే.. చికెన్ ను రాయలసీమ స్టైల్లో వండితే ఆ కిక్కే వేరు.. రాయలసీమ ప్రాంతానికి చెందిన అద్భుతమైన చికెన్ కర్రీని స్పెషల్ గా వండుకుంటే ఆ రుచే వేరు.. ఈ ప్రత్యేకమైన చికెన్ కూరలో, సాధారణంగా వాడే కారం బదులుగా మిరియాలపొడిని ఉపయోగించడం ద్వారా ఒక విలక్షణమైన, ఘాటైన రుచిని పొందుతారు. ఇది రాయలసీమ వంటకాల శైలికి ప్రత్యేకత. ముఖ్యంగా, రాగి సంకటి, జొన్న సంకటి వంటి సంకటి రకాలతో ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది.
ఈ రాయలసీమ చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: చికెన్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి (కారం బదులుగా), ధనియాల పొడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సోంపు, టమాటా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, నిమ్మకాయ, యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు, కొత్తిమీర..
ముందుగా, ఒక పాన్‌ను వేడి చేసి అందులో నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తరువాత సోంపు వేసి సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత యాలకులు, చిన్న ముక్కలుగా కట్ చేసిన దాల్చిన చెక్కను వేసి సుమారు ఒక నిమిషం పాటు సిమ్‌లో వేయించాలి. దినుసులను పొడిగా కాకుండా నేరుగా వాడుకోవాలి.
ఆ తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంతవరకు సుమారు రెండు నిమిషాల పాటు తిప్పుకుంటూ వేయించాలి. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి, అవి మెత్తబడేంతవరకు మూడు నిమిషాల పాటు వేయించాలి.
టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత, పెద్ద ముక్కలుగా తీసుకున్న చికెన్‌ను వేసి బాగా కలియబెట్టాలి. సిమ్‌లో పెట్టి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆపై పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. తరువాత ధనియాల పొడి వేసి మరోసారి కలపాలి. పసుపు, ఉప్పు, ధనియాల పొడి చికెన్‌కి బాగా పట్టడానికి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.
ఇప్పుడు, ఐదు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, చికెన్ బాగా దగ్గరపడిన తర్వాత, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. తరువాత ఒక చిన్న గ్లాస్ నీరు మాత్రమే వేయాలి, ఎక్కువ నీరు అవసరం లేదు.. ఎందుకంటే ఈ కూర దగ్గరగా గ్రేవీ కూరలా రావాలి. కొత్తిమీర వేసి, మూత పెట్టి మరో ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి.
గ్రేవీ దగ్గరపడిన తర్వాత, నిమ్మకాయను పిండి, బాగా కలిపి మరో ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. చివరగా, గ్రేవీ పూర్తిగా దగ్గరపడి దాదాపు ఫ్రైలా అయ్యేంత వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఘాటైన రాయలసీమ చికెన్ కూర సిద్ధం అవుతుంది.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..