
ఏదైనా పండగొచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియులు మటన్ కూరను ఎంతో ఇష్టంగా కొనితెచ్చుకుని.. పలు రకాలుగా వండుకొని తింటారు.. అయితే, మటన్‌లోని చాలా భాగాలు అన్ని పోషకరమైనవే.. వీటిలో ప్రోటీన్ తోపాటు.. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. మేక మాంసంతోపాటు.. తలకాయ, కాళ్లు, బోటీ, లివర్ తోపాటు.. మేక అవయవ భాగాలలో అత్యంత కీలకమైన ‘తిల్లి’ (స్ప్లీన్/Spleen) అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారంగా నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారికి, గర్భిణులకు, బాలింతలకు ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తిల్లిలో ప్రోటీన్, ఐరన్ తోపాటు.. అనేక పోషకాలు దాగున్నాయి.. అందుకే దీనిని ఖనిజాల గనిగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు..
రక్తహీనత నివారణ: తిల్లిలో అత్యధిక స్థాయిలో ఐరన్, విటమిన్లు లభిస్తాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని వేగంగా పెంచి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
తక్షణ శక్తి – నిరంతర ఉత్సాహం: తరచూ నిరసించిపోయే వారికి, అలసట, బలహీనతతో బాధపడేవారికి ఇది శారీరక దృఢత్వాన్ని అందిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం: ఇందులోని ప్రొటీన్లు, ఖనిజ లవణాలు శరీర ప్రతిబంధక శక్తులను పెంపొందించి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
రుచికరమైన ‘తిల్లి ఇగురు’ వండే పద్ధతి గురించి తెలుసుకుందాం..
మొదట ఫ్రెష్ మేక తిల్లిని తెచ్చుకుని.. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
పోపు వేయడం: బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి దోరగా వేయించాలి.
ఉడికించడం: కట్ చేసిన ముక్కలను వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అనంతరం టమోటాలు, తగినంత కారం, ఉప్పు చేర్చి, స్వల్పంగా నీరు పోసి మూతపెట్టి మెత్తబడే వరకు ఉడకనివ్వాలి.
మసాలాలు చేర్చడం: ముక్కలు బాగా ఉడికాక ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే ఘుమఘుమలాడే కూర సిద్ధమవుతుంది.
దీనిని వేపుడుగా (Fry) లేదా పులుసు రూపంలోనూ తయారు చేసుకోవచ్చు. ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆహార మార్పుల విషయంలో వైద్యాధికారుల సలహాలు తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..