
మామిడి అల్లం.. తెలుగు వంటకాల్లో అంతగా పరిచయం లేని ఒక అద్భుతమైన వంట దినుసు.. సాధారణంగా మనం ఉపయోగించే అల్లం మట్టి రంగులో ఘాటుగా ఉంటే, మామిడి అల్లం లేత తెలుపు రంగులో ఉండి, పచ్చి మామిడికాయ రుచిని పోలిన కమ్మదనాన్ని, తక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఇది సంవత్సరమంతా లభిస్తుంది. తాజాగా దొరుకుతుంది. మామిడి అల్లం పచ్చడిని వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడానికి మామిడి అల్లం, పచ్చిమిర్చి లేదా పండు మిర్చి/ ఎండు మిర్చి, చింతపండును సమాన నిష్పత్తిలో తీసుకుంటారు.
వాస్తవానికి అల్లం వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధం.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, వాంతులు, వికారాన్ని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడం, జలుబు – దగ్గు నుండి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అల్లంలో ఉండే ‘జింజెరాల్’ అనే సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి, ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మొదట, మామిడి అల్లంను శుభ్రంగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు నుంచి గింజలను తొలగించాలి. మిక్సీ జార్‌లో మామిడి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు, పచ్చిమిర్చి ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ మిశ్రమానికి పుల్లదనం, ఘాటును పెంచడానికి నిమ్మరసం కచ్చితంగా కలపాలి. ఇది మామిడి అల్లం సున్నితమైన రుచికి పదును పెడుతుంది. నీటి చుక్క కూడా కలపకుండా, ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. దీనిని “తొక్కు” అని అంటారు. ఈ తొక్కును గాలి చొరబడని డబ్బాలో ఫ్రిజ్‌లో దాదాపు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని విదేశాలలో ఉన్న వారికి కూడా పంపవచ్చు..
పచ్చడిని తినడానికి ముందుగా తాలింపు పెట్టుకోవాలి. కడాయిలో మామిడి అల్లం పరిమాణానికి సమానంగా నువ్వుల నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. అప్పటికప్పుడు తినడానికి ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు వంటివి కలుపుకోవచ్చు. ఎక్కువ కాలం నిల్వ కోసం వాటిని వేయకుండా ఉండటం మంచిది. తాలింపు వేగిన తర్వాత, రుబ్బి పెట్టుకున్న మామిడి అల్లం తొక్కును వేసి ఐదు నుండి ఆరు నిమిషాలు మీడియం మంటపై బాగా వేయించాలి. తొక్కులోని తేమ పూర్తిగా ఆరిపోయి, నూనె పైకి తేలే వరకు వేయించడం ముఖ్యం. నూనె, ఉప్పు, చింతపండు, నిమ్మరసం ఈ పచ్చడికి సహజ సంరక్షకాలుగా పనిచేస్తాయి, ఎక్కువ నూనె వాడకం నిల్వ కాలాన్ని పెంచుతుంది.
ఈ పచ్చడిలో వెల్లుల్లిని అస్సలు చేర్చకూడదు. మామిడి అల్లం మైల్డ్ ఫ్లేవర్‌ను వెల్లుల్లి పూర్తిగా డామినేట్ చేస్తుంది. పచ్చడి చల్లారిన తర్వాతే శుభ్రమైన, పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. వేడి అన్నంలో నెయ్యితో, జొన్న రొట్టెలతో ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. కావాలంటే తాలింపులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి లేదా పండు మిర్చిని ఉపయోగించి కూడా ఈ పచ్చడిని తయారు చేయవచ్చు. ఇది రుచిలో వైవిధ్యాన్ని అందిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..