Sprouts Making: మొలకలు స్పీడ్‌గా రావాలంటే జస్ట్ ఇలా చేయండి.. వాసన రాదు.. జిగురు ఉండదు..

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి మొలకలు అద్భుతమైన ఆహారం. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే మొలకలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే ఇంట్లో మొలకలు తయారు చేసే సమయంలో జిగురుగా మారడం, వాసన రావడం, కుళ్లిపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి.

Sprouts Making: మొలకలు స్పీడ్‌గా రావాలంటే జస్ట్ ఇలా చేయండి.. వాసన రాదు.. జిగురు ఉండదు..
Make Perfect Sprouts

Updated on: Jul 14, 2026 | 11:51 AM

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి మొలకలు అద్భుతమైన ఆహారం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాస్తానికి మొలకలు పోషకాల భాండాగారం. వీటిలో విటమిన్లు ఎ, బి, సి, కె.. తోపాటు.. ఖనిజాలు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండి, జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి.. అంతేకాకుండా.. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే, చాలామందికి ఇంట్లో మొలకలు సరిగా రావు.. కొన్నిసార్లు జిగురుగా మారడం లేదా కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి మొలకలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ కథనంలో జిగురులేకుండా, పరిపూర్ణంగా, సులభంగా జీర్ణమయ్యే మొలకలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో దశలవారీగా తెలుసుకోండి.. ముఖ్యంగా, ప్రతి అడుగులో పాటించాల్సిన ఈ చిట్కాలను అనుసరిస్తే.. మొలకలు జిగురుగా.. వాసన లేకుండా.. తీయగా అద్భుతంగా వస్తాయి..

మొలకలకు సరైన గింజల ఎంపిక

మొలకల తయారీకి పెసలు అత్యంత సులభమైన.. ప్రజాదరణ పొందిన ఎంపిక. సాధారణ పెసలతో పాటు, నాటు పెసలు కూడా మంచివి. గింజలు పాతవి కాకుండా, తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియోలో చూపినవి నల్లగా కనిపించే నాటు పెసలు.. కానీ మీరు సాధారణ ఆకుపచ్చ పెసలను కూడా ఉపయోగించవచ్చు.

మొలకల తయారీ దశలు:

గింజలను నానబెట్టడం:

  • ఒక గిన్నెలో సరిపడిన విధంగా కొన్ని పెసలు తీసుకోండి..
  • వీటిని కనీసం రెండు సార్లు శుభ్రమైన నీటితో కడగండి. ఇది గింజలపై ఉన్న దుమ్ము, ధూళి, పురుగు మందుల అవశేషాలను తొలగిస్తుంది.
  • కడిగిన పెసలలో సరిపడా నీరు పోసి, 10-12 గంటల పాటు నానబెట్టాలి. ఉదాహరణకు, మీరు రాత్రి నానబెడితే, మరుసటి రోజు ఉదయానికి అవి చక్కగా నానిపోతాయి. గింజలు మధ్యలో విడిపోయినట్లు కనిపిస్తాయి.. ఇది అవి సరిగ్గా నానినట్లు సూచిస్తుంది.
  • ముఖ్య చిట్కా: మొత్తం మొలకల ప్రక్రియకు 36 గంటలు పడుతుంది. కాబట్టి మీ భోజన ప్రణాళికకు అనుగుణంగా నానబెట్టడం ప్రారంభించండి.

నానిన గింజలను శుభ్రపరచడం:

నానిన పెసలను తిరిగి 2-3 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఈ దశ చాలా ముఖ్యం. సరిగా కడగకపోతే మొలకలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది.

మొలకల కోసం మూట కట్టడం:

ఒక పలుచని, శుభ్రమైన, పొడి గుడ్డను తీసుకోండి. దళసరి గుడ్డను వాడకూడదు, ఎందుకంటే దానికి గాలి సరిగా ఆడదు.

శుభ్రంగా కడిగి, నీరు లేకుండా ఆరబెట్టిన పెసలను ఈ పలుచని గుడ్డలో వేయండి.

గుడ్డను గట్టిగా మూట కట్టండి.

మూటను నిల్వ చేయడం:

ఈ మూటను ఒక డబ్బాలో లేదా గిన్నెలో ఉంచండి. మీరు తరచుగా మొలకలు తినేవారైతే, మొలకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డబ్బా (స్ప్రౌట్ మేకర్) కొనుగోలు చేయడం మంచిది. ఇది గాలి ఆడటానికి సహాయపడుతుంది.

మీ దగ్గర అలాంటి డబ్బా లేకపోతే, ఒక సాధారణ గిన్నెలో మూటను ఉంచి, పైన ఒక ప్లేట్‌ను కప్పండి. గాలి చొరబడని మూతను మాత్రం పెట్టవద్దు. మొలకలకు గాలి ఆడటం చాలా ముఖ్యం.

సరైన ఉష్ణోగ్రత:

మొలకల రావడానికి గది ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. అవి చాలా వేడిగా ఉండకూడదు, అలాగే చాలా చల్లగా కూడా ఉండకూడదు.

డబ్బా లేదా గిన్నెను వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచండి.

మొదటి దశ మొలకలు (తినకూడనివి):

  • ఉదయం మూట కట్టిన తర్వాత, సాయంత్రానికి చిన్న మొలకలు వస్తాయి. ఈ దశలో వాటిని తినకూడదు. ఇలా తింటే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
  • ఈ చిన్న మొలకలను తిరిగి ఒకసారి శుభ్రమైన నీటితో కడగండి.
  • మళ్లీ అదే గుడ్డలో మూట కట్టి, అదే డబ్బాలో మరో 12 గంటల పాటు ఉంచండి.

పరిపూర్ణ మొలకలు సిద్ధం (మొత్తం 36 గంటల తర్వాత):

  • తిరిగి పెట్టిన మొలకలు, మరుసటి రోజు ఉదయానికి సుమారు 2 అంగుళాల పొడవు పెరుగుతాయి.
  • పరిపూర్ణ మొలకలు.. పొడవున్న మొలకలు జీర్ణానికి సులువుగా ఉంటాయి.. వాటిలోని పోషకాలు బాగా అందుతాయి.

మొలకల వినియోగం:

సిద్ధమైన మొలకలను తినే ముందు ఇంకొకసారి శుభ్రంగా కడగాలి.

స్పైసీగా తినాలనుకుంటే: కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలుపుకొని తినవచ్చు.

స్వీట్‌గా తినాలనుకుంటే: కొద్దిగా తేనె కలుపుకొని తినవచ్చు.

ఈ పద్ధతిని అనుసరిస్తే మీరు కచ్చితంగా పరిపూర్ణమైన, ఆరోగ్యకరమైన మొలకలను ఇంట్లోనే తయారు చేసుకోగలరు. ఈ ప్రక్రియలో సరైన శుభ్రత, ఉష్ణోగ్రత, గాలి ఆడటం కీలకమైన అంశాలు. ఈ చిట్కాలను పాటిస్తూ మీరు కూడా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us