
మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉండటం చాలా ముఖ్యం. సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే, అనియంత్రిత బ్లడ్ షుగర్ కారణంగా తీవ్రమైన శారీరక అలసట, నీరసం, కాళ్ల పాదాలలో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ నిత్య ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిఫారసు చేస్తున్నారు. అదే మొలకెత్తిన రాగి, మెంతులతో తయారు చేసే ప్రత్యేక అల్పాహారం!
రాగులు – 100 గ్రాములు
మెంతులు – 1 టీస్పూన్
తరిగిన క్యారెట్ తురుము, దోసకాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము
తగినంత ఉప్పు
మొదటగా 100 గ్రాముల రాగులను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో ఈ రాగులతో పాటు 1 స్పూన్ మెంతులు వేయాలి.100 గ్రాముల రాగులకు 1 స్పూన్ మెంతులు సరిపోతాయి. వీటిని నీటిలో సుమారు 8 గంటల పాటు బాగా నానబెట్టాలి. మరుసటి రోజు నీటిని వడకట్టి, ఆ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన తెల్లటి కాటన్ గుడ్డలో మూటలా కట్టి వేలాడదీయాలి. సుమారు 24 నుండి 32 గంటలు గడిచేసరికి ఇవి చక్కగా మొలకెత్తుతాయి.
మొలకెత్తిన ఈ ధాన్యాలను పచ్చిగా తినకుండా, ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరిపై 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్లో ఉడికించకూడదు. బాగా ఉడికిన తర్వాత వీటిని చల్లార్చి, ఒక చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. రుచి, పోషకాల కోసం ఇందులో క్యారెట్, దోసకాయ, పచ్చి కొబ్బరి తురుములను కలుపుకోవాలి. నూనె ఉపయోగించకుండా చేసుకునే ఈ ఆహారాన్ని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం పూట స్నాక్స్‌లా తీసుకోవచ్చు.
రక్తంలో చక్కెర నియంత్రణ: రాగి, మెంతులు రెండూ కలిసి పనిచేసి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
శరీర శక్తి: రాగులలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించి, శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది మరియు తీవ్రమైన అలసటను దూరం చేస్తుంది.
పాదాల మంట తగ్గింపు: మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాత్రి సమయాల్లో వచ్చే పాదాల మంట, తిమ్మిర్లను తగ్గించడంలో ఈ ఆహారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. పిల్లలకు ఇచ్చేటప్పుడు ఇందులో కొద్దిగా దానిమ్మ గింజలు లేదా ఆపిల్ ముక్కలు కలిపి ఇవ్వవచ్చు.