
పాలు – గుడ్డు సంపూర్ణాహారాలని, పిల్లల పెరుగుదలకు ఇవి అత్యవసరమని మన పెద్దలు తరచుగా చెప్తుంటారు. పిల్లలకి రోజూ ఒకట్రెండు గుడ్లు, రెండు గ్లాసుల పాలు అందించడం సాధారణంగా మనం చూస్తుంటాం. చాలామంది తల్లిదండ్రులు ఉదయం గుడ్లు, ఒక గ్లాసు పాలు, రాత్రి పడుకునే ముందు మరో గ్లాసు పాలు పిల్లలకు అందిస్తుంటారు. గుడ్డు, పాలలో ప్రోటీన్లు, పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని, అవి పిల్లలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయని భావిస్తారు. పూర్వకాలంలో గుడ్లు, పాలు సులువుగా, ఉచితంగా లభించేవి. కానీ ఈ రోజుల్లో వాటి ధరలు పెరిగిపోయాయి. అయినప్పటికీ, పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా వీటిని కొనిస్తున్నారు.
గుడ్డు, పాలలో అద్భుతమైన పోషకాలు దాగున్నాయి.. ఒక కోడిగుడ్డులో సుమారు 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల గేదె పాలలో 3 నుండి 3.5 గ్రాముల ప్రోటీన్ ఉండగా, ఆవుపాలలో 1 నుండి 2 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇతర పోషకాలు కూడా ఈ రెండింటిలోనూ ఉంటాయి. అయితే, మీరు మీ పిల్లలకు గుడ్లు, పాలు పుష్కలంగా అందిస్తున్నప్పటికీ, వారు హార్మోన్ల లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా .. అనేది చూసుకోవాలి.. లేకపోతే.. మీ పిల్లల్ని వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలి..
ఈ రోజుల్లో పిల్లల్లో కూడా థైరాయిడ్ సంబంధిత హార్మోన్ లోపాలు అధికంగా కనపడుతున్నాయి. అమ్మాయిలు 9, 10 ఏళ్లకే యుక్తవయసుకి వస్తున్నప్పటికీ, హార్మోన్ సమస్యల కారణంగా రుతుక్రమ సమస్యలు, మొటిమలు, PCOD వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అబ్బాయిలలో వీర్యకణాల నాణ్యత, పరిమాణం తగ్గిపోతున్నాయి. వివాహానంతరం, గుడ్లు-పాలు బాగా తీసుకున్న వారిలో కూడా ప్రతి 100 జంటలలో 30 నుండి 40 జంటలకు సంతానలేమి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంత మంచి ఆహారం అందించినప్పటికీ, ఈ హార్మోన్ లోపాలు ఎందుకు వస్తున్నాయనేది ఆలోచించాలని.. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు..
గుడ్డు, పాలలో ప్రోటీన్ చాలా తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. పాలు, గుడ్డు శిశువులకు, చిన్నపిల్లలకు (5-8 ఏళ్లలోపు) మాత్రమే సంపూర్ణాహారం కావచ్చు. వారి చిన్న శరీరాలకు అవి సరిపోతాయి. కానీ శరీరం పెరిగిన తర్వాత ఎక్కువ పోషకాలు అవసరం. అర లీటరు పాలలో 15-16 గ్రాముల ప్రోటీన్, ఒక గుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మొత్తం కలిపినా 22-23 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలకు వారి శరీర బరువులో ప్రతి కేజీకి 2 గ్రాముల ప్రోటీన్ అవసరం. పిల్లల సాధారణ ఆహారంలో భాగంగా తెల్లటి పాలిష్ పట్టిన అన్నంలో ప్రోటీన్ ఉండదు. కూరల్లో ప్రోటీన్ తక్కువ. కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పులు కూడా తక్కువ మోతాదులో తీసుకుంటారు. నాన్-వెజ్ లో కూడా మాంసం కంటే గ్రేవీకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ కారణాల వల్ల పిల్లలకు అవసరమైన ప్రోటీన్ అందడం లేదు. ప్రోటీన్ – ఇతర పోషకాల లోపం వల్ల హార్మోన్ లోపాలు వస్తున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..
ఈ హార్మోన్ లోపాలను మీ పిల్లల్లో సరిచేయడానికి, గుడ్డు, పాలకు బదులుగా మరికొన్ని పదార్థాలను తీసుకోవాలి.. ఉదయం మొలకెత్తిన విత్తనాలు (అన్ని రకాలు), వేరుశెనగలు ఇవ్వండి. వీటిలో 30-40% ప్రోటీన్ లభిస్తుంది. మధ్యాహ్నం కందిపప్పు, పెసరపప్పు అధికంగా వేసిన ఆకుకూరలను వండి పెట్టండి. దీని ద్వారా మరో 20% ప్రోటీన్ అందుతుంది. సాయంత్రం పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం వంటి 4-5 రకాల విత్తనాలను నానబెట్టి, ఖర్జూరాలు, పండ్లతో పాటు అందించండి.
ఈ ఆహారాన్ని రెండు మూడు నెలలు పాటించడం వల్ల పిల్లల్లో రుతుక్రమ సమస్యలు, థైరాయిడ్ హార్మోన్ లోపాలు తగ్గుతాయి. PCOD సమస్యలు పరిష్కారమవుతాయి. అబ్బాయిలలో వీర్యకణాల చలనం పెరుగుతుంది. సంతానలేమి సమస్యలున్న జంటలు 3-5 నెలల్లో గర్భం దాల్చే అవకాశం ఉంది. గుడ్డు, పాలలో లభించే పోషకాలు చాలా తక్కువ, అవి సరిపోవు. వాటి కంటే మెరుగైన, తక్కువ ఖర్చుతో కూడిన సంపూర్ణాహారాలు, గొప్ప పోషకాహారాలు ఎండు విత్తనాలు, మొలకలు. పెద్ద వయసు పిల్లలకు గుడ్డు, పాలు సంపూర్ణాహారమే అయినప్పటికీ.. ఈ ప్రత్యామ్నాయ ఆహారాలను అందించడం ద్వారా మీ పిల్లలు హార్మోన్ లోపాలు లేకుండా బలంగా, ఆరోగ్యంగా తయారవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. ఏమైనా సందేహాలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..