లైట్ తీసుకోవద్దు.. చికెన్ లివర్, మటన్ లివర్ తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి..

లివర్ అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ తింటారు. శరీరానికి రక్తం పట్టాలన్నా, ఎనర్జీ రావాలన్నా చాలామంది వెంటనే లివర్ తినమని సలహా ఇస్తుంటారు. అయితే మార్కెట్‌‌కు వెళ్లినప్పుడు చికెన్ లివర్ మంచిదా లేక మటన్ లివర్ మంచిదా అనే కన్‌ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. అంతేకాదు.. కొండంత పోషకాలు ఇచ్చే ఈ కాలేయం కొన్ని ఆరోగ్య సమస్యల వారికి విషంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

లైట్ తీసుకోవద్దు.. చికెన్ లివర్, మటన్ లివర్ తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి..
Chicken Liver Vs Mutton Liver

Updated on: Oct 03, 2026 | 7:40 PM

నాన్‌వెజ్ ప్రియుల ప్లేటులో లివర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణ మాంసంతో పోలిస్తే కాలేయంలో శరీరానికి మేలు చేసే కీలక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అత్యధిక మోతాదులో లభిస్తాయి. అందుకే నీరసంగా ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి వైద్యులు, డైటీషియన్లు తరచూ లివర్ తినమని సలహా ఇస్తుంటారు. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలామందిలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అదే చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా? అసలు ఈ రెండింటిలో ఉండే పోషక విలువల తేడాలేంటి? ఎవరి శరీర తత్వానికి ఏది సరిపోతుంది? అలాగే కాలేయంలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న కొందరు వ్యక్తులు దీన్ని పొరపాటున కూడా ముట్టకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చికెన్ లివర్

సాధారణ చికెన్‌తో పోలిస్తే కోడి కాలేయంలో ఐరన్ శాతం దాదాపు 10 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో చాలా వేగంగా శోషించబడుతుంది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. రక్తహీనతతో బాధపడే మహిళలకు ఇది గొప్ప ఆహారం. ఇందులో విటమిన్ బి12, ఫోలేట్, విటమిన్ ఎ, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. మేక కాలేయంతో పోలిస్తే ఇది త్వరగా జీర్ణమవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషణ పొందాలనుకునేవారికి చికెన్ లివర్ బెస్ట్ ఛాయిస్.

మటన్ లివర్

మేక కాలేయాన్ని పోషకాల పవర్‌హౌస్‌గా చెప్పవచ్చు. చికెన్ లివర్‌తో పోలిస్తే ఇందులో కొన్ని ప్రత్యేక ఖనిజాలు అధికంగా లభిస్తాయి. మటన్ లివర్‌లో జింక్, కాపర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఇందులో విటమిన్ ఎ, డి, బి12 సమృద్ధిగా ఉండి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా చేస్తాయి. శరీరానికి అదనపు పోషణ, బలం అవసరమైన వారికి ఇది చాలా మంచిది.

ఎవరు ముట్టకూడదు? ఎవరికి ప్రమాదం?

లివర్‌లో ఎంత మేలు చేసే పోషకాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో కొలెస్ట్రాల్, సోడియం, విటమిన్-ఎ ఉంటాయి. కాబట్టి కింది సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం:

గుండె జబ్బులు, బీపీ ఉన్నవారు: కాలేయంలో కొలెస్ట్రాల్, సోడియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె సంబంధిత సమస్యలు, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తినకపోవడమే మంచిది.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు: ఇందులో ప్రొటీన్లు, ఖనిజాలు భారీ మోతాదులో ఉండటం వల్ల కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

గర్భిణీ స్త్రీలు: కాలేయంలో విటమిన్-ఎ పరిమితికి మించి ఉంటుంది. గర్భధారణ సమయంలో విటమిన్-ఎ అతిగా తీసుకుంటే పిండంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. వైద్యుల సలహా లేకుండా తినకూడదు.

చిన్నపిల్లలు: రెండేళ్ల లోపు పిల్లల్లో జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా బలపడదు కాబట్టి, కాలేయం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఎలా తినాలి? ఎంత తినాలి?

ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కాలేయాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లకు మించి తీసుకోకూడదు. అలాగే నూనెలో వేయించి డీప్ ఫ్రై చేయడం కంటే, చక్కగా ఉడకబెట్టి తక్కువ మసాలాలతో వండుకుని తినడం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.

(గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన, ఆరోగ్యంపై స్పృహ కోసం మాత్రమే. కాలేయం వంటి ఆహారాలు శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణులు తమ డైట్‌లో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us