
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చనే అవగాహన అందరిలోనూ వస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ సీడ్స్‌గా పిలిచే చియా గింజలు, గుమ్మడి గింజలు నేడు ప్రతి ఒక్కరి కిచెన్ డైట్‌లో భాగమవుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది మీ శరీరానికి ఎక్కువ మేలు చేస్తుందనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. వాస్తవానికి ఈ రెండు గింజలు పోషకాల గనులే అయినప్పటికీ, వాటి పనితీరు, ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి.
మీరు బరువు తగ్గాలని లేదా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే చియా సీడ్స్ అద్భుతమైన ఎంపిక. వీటిలో గుమ్మడి గింజల కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల ఆహారం తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. తద్వారా అనవసరమైన ఆకలి తగ్గుతుంది. అంతేకాకుండా చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియానికి ప్రధాన వనరులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఎముకల దృఢత్వానికి కూడా తోడ్పడతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.
మరోవైపు కండరాల బలం, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి గుమ్మడి గింజలు సరైన తోడుగా నిలుస్తాయి. చియా గింజలతో పోలిస్తే వీటిలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. శరీర కణాల మరమ్మత్తుకు, కండరాల నిర్మాణానికి ఈ ప్రోటీన్ అత్యవసరం. అన్నింటికంటే ముఖ్యంగా గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రాత్రిపూట నిద్రలేమితో బాధపడేవారు ఈ గింజలను తీసుకోవడం వల్ల వీటిలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. వీటిలో ఉండే జింక్ మరియు విటమిన్-E రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా మారుతాయి.
చివరగా ఈ రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కాకుండా రెండింటినీ మీ దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీకు ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, ఒమేగా-3 వంటి అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. అయితే తీసుకునే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చియా గింజలను ఎప్పుడూ నేరుగా పొడిగా తినకూడదు వాటిని నీటిలో లేదా స్మూతీస్ వంటి ద్రవ పదార్థాల్లో కనీసం 20 నిమిషాలు నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. గుమ్మడి గింజలను పచ్చిగా లేదా దోరగా వేయించి స్నాక్స్‌లా తీసుకోవచ్చు. మీ శరీర అవసరాలను బట్టి ఈ సూపర్ సీడ్స్‌ను మీ డైట్‌లో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.