
ముక్క లేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్.. ఇలా వెరైటీ ఏదైనా సరే లాగించేస్తారు. అయితే మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే ఫారం కోడి మంచిదా? లేక పల్లెటూళ్లలో సహజంగా పెరిగే నాటు కోడి మేలా? ఈ రెండింటిలో పోషకాలు ఎందులో ఎక్కువ ఉన్నాయి? అనేదానికి వైద్య నిపుణులు ఆసక్తికర సమాధానాలు తెలిపారు. చాలా మంది తక్కువ ధరకు లభిస్తుందని బ్రాయిలర్ చికెన్‌ను కొనుగోలు చేస్తారు. కానీ వీటి పెంపకం వెనుక ఉన్న చేదు నిజం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బ్రాయిలర్ కోళ్లను త్వరగా పెంచడానికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
ప్రకృతి ఒడిలో సహజమైన ఆహారం తింటూ పెరిగే నాటు కోడి మాంసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌లో 150 కేలరీలు ఉంటే నాటు కోడిలో కేవలం 120 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. దీనిలోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నాటు కోడి మాంసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నాటు కోడిలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి..
ప్రోటీన్ – విటమిన్లు: కండరాల పుష్టికి ప్రోటీన్, ఎముకల బలానికి విటమిన్ డి, ఇ మరియు బి-కాంప్లెక్స్ లభిస్తాయి.
ఖనిజాలు: జింక్, సెలీనియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
ధర కొంచెం ఎక్కువైనా, రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే నాటు కోడిని ఎంచుకోవడమే ఉత్తమం. సరైన పద్ధతిలో వండుకుని తింటే నాటు కోడి ద్వారా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.