Gongura Mutton Curry: ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ ఆహా అనాల్సిందే!
Andhra Style Gongura Mutton Curry Recipe: గోంగూర మటన్ కర్రీ.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన వంటకం. పుల్లని గోంగూర ఆకుల ఘాటైన రుచి, లేత మటన్ కలయికతో ఇది అద్భుతమైన రుచినిస్తుంది. మీరు కూడా ఇంట్లోనే ఈ సాంప్రదాయక వంటకాన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నాన్‌వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సండె వచ్చిందంటే చాలా ఇంట్లో చికెనో లేదో మటనో ఉండాల్సిందే. ఇక ఇందులో మటన్ ప్రియులు ప్రత్యేకంగా ఉంటారు. వీరు మటన్‌ను వెరైటీ వెరైటీగా చేసుకొని తింటూ ఉంటారు. చాలా మందికి హోటల్, ఇతర ప్రాంతాల్లో చేసే మటన్ కర్రీస్ ఇంట్లో చేసుకొని తినాలి అనుకుంటారు. కానీ దాన్ని ఎలా వండాలో తెలియక వదిలేస్తారు. అలాంటి వారి కోసం ఈ రెసిపీ.. మీకు ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ ఇష్టం అయితే దాన్ని ఇంటి వద్దే ఎలా సులబంగా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
నూనె, దాల్చిన చెక్క, లవంగా, యాలకులు, సోంపు – తగినంత
ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 చెంచాలు
మటన్ – 1 కిలో
పసుపు – 1 చెంచా
కారం – 4 చెంచాలు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – 1 1/2 కప్పులు
గోంగూర ఆకులు – 2 కట్టలు
గోంగూర మటన్ కర్రీ తయారీ విధానం:
గోంగూర మటన్ తయారీ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌ను తీసుకుని అందులో కాస్తా నూనె వేసి దాన్ని స్టవ్‌పై వేడి చేయాలి. నూనె వేడెక్కాక, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చెక్క, లవంగా, యాలకులు, సోంపు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కిలో మటన్ ముక్కలను, 1 చెంచా పసుపు, 4 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. మటన్ లేతది అయితే నేరుగా ఉడికించవచ్చు, అదే ముదురు మటన్ అయితే మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించడం ఉత్తమం.
మటన్ ముక్కలకు కారం బాగా పట్టిన తర్వాత, నీళ్లు ముక్కలకు సమానంగా మునిగే వరకు పోసి, మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్‌లో అయితే 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ సుమారు 70% ఉడికిన తర్వాత తదుపరి దశకు సిద్ధంగా ఉంటుంది.
ఇప్పుడు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను ఉడికిన మటన్ పైన వేసి, తిరిగి మూత పెట్టాలి. సుమారు 10 నిమిషాల పాటు ఆవిరితో గోంగూర మెత్తగా ఉడికి, మటన్‌లో కలిసిపోయేలా చూసుకోవాలి. మూత తీయకుండా ఉండడం వలన గోంగూర బాగా ఉడుకుతుంది.
గోంగూర మెత్తగా ఉడికి మటన్‌తో కలిసిపోయిన తర్వాత, మొత్తాన్ని బాగా కలిపి, మరో 10-15 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి. దీనివల్ల గోంగూర, మటన్ రుచులు ఒకదానికొకటి బాగా కలిసిపోయి, అద్భుతమైన రుచి వస్తుంది. ఈ కూర పులుసు మాదిరిగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మధ్యస్థ చిక్కదనం గల గ్రేవీతో ఉండాలి. చివరిగా, రుచిని సరిచూసుకుని, అవసరమైతే ఉప్పు లేదా కారం కలుపుకోవచ్చు.
అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ రెడీ అయినట్టే దీన్ని అన్నంతో కలిపి తింటే అబ్బా, మళ్లీ మళ్లీ మటన్‌ను ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది. ఈ అమోఘమైన రుచిని మీరు కూడా ఇంటి వద్ద ప్రయత్నించి ఆస్వాదించండి.