తలనొప్పి వచ్చినప్పుడు టీ తాగితే ఏమవుతుంది..? ఈ నిజాలు పక్కా తెలుసుకోండి..

తలనొప్పి రాగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఒక కప్పు వేడి వేడి టీ.. టీ తాగితే తలనొప్పి ఇట్టే మాయమవుతుందని అనుకుంటాం.. కానీ నిజానికి టీ తలనొప్పిని తగ్గిస్తుందా? లేక ఇంకా పెంచుతుందా? అతిగా టీ తాగడం వల్ల లేదా అకస్మాత్తుగా మానేయడం వల్ల వచ్చే తలనొప్పుల వెనుక అసలు రహస్యం ఏంటి? ఈ విషయాలపై డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తలనొప్పి వచ్చినప్పుడు టీ తాగితే ఏమవుతుంది..? ఈ నిజాలు పక్కా తెలుసుకోండి..
Does Tea Cure Headaches Or Cause Them

Updated on: Oct 23, 2026 | 9:33 PM

రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడో లేదా ఒత్తిడి వల్ల తలనొప్పి మొదలైనప్పుడో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఒక కప్పు వేడి వేడి టీ. పెయిన్ కిల్లర్ మాత్ర వేసుకునే బదులు టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయితే టీ తాగడం వల్ల నిజంగానే తలనొప్పి తగ్గుతుందా? లేక తాత్కాలికంగా మాత్రమే మాయమవుతుందా? అతిగా టీ తాగడం వల్ల కొత్తగా తలనొప్పులు వచ్చే ప్రమాదం ఉందా? అనే విషయాలపై ఆరోగ్య నిపుణులు కీలక అంశాలను వెల్లడిస్తున్నారు. టీలో ఉండే కెఫిన్ మెదడు పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది రక్తనాళాల సంకోచాన్ని నియంత్రించడంతో పాటు నరాల ద్వారా నొప్పి సంకేతాలు మెదడుకు చేరే వేగాన్ని తగ్గిస్తుంది. అందుకే మార్కెట్లో లభించే కొన్ని రకాల తలనొప్పి మందులలో కూడా కెఫీన్‌ను ఒక మూలకంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా నిత్యం టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు అనుకోకుండా సమయానికి తాగకపోతే వచ్చే తలనొప్పులకు.. ఆ సమయంలో తాగే ఒక కప్పు టీ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

అతిగా తాగితే రివర్స్ ఎఫెక్ట్..

తలనొప్పి వచ్చిన ప్రతిసారీ టీ తాగడం పరిష్కారం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించి కెఫీన్ శరీరంలోకి చేరితే అది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రాత్రిపూట నిద్రపట్టకపోవడం, ఆ నిద్రలేమి మరుసటి రోజు తీవ్రమైన తలనొప్పికి దారితీయడం జరుగుతుంది. చాలామంది తలనొప్పి తగ్గడం కోసం ఉదయాన్నే లేదా ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో స్ట్రాంగ్ టీ తాగుతుంటారు. దీనివల్ల ఎసిడిటీ పెరిగి కడుపులో మంట, గుండెల్లో మంటతో పాటు జీర్ణక్రియ మందగిస్తుంది.

అకస్మాత్తుగా మానేస్తే కెఫీన్ విత్‌డ్రాయల్

రోజూ నాలుగు ఐదు కప్పుల టీ తాగే అలవాటు ఉన్నవారు దాన్ని అకస్మాత్తుగా ఆపేస్తే తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, విపరీతమైన చిరాకు ఎదురవుతాయి. దీనిని వైద్య పరిభాషలో కెఫిన్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. కాబట్టి టీ అలవాటును తగ్గించుకోవాలనుకునే వారు ఒక్కసారిగా కాకుండా.. రోజువారీ కప్పుల సంఖ్యను క్రమంగా తగ్గించుకోవాలి.

అల్లం టీతో మైగ్రేన్ నయమవుతుందా?

తలనొప్పికి చాలామంది అల్లం టీ తాగుతుంటారు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాంతులు, వికారం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది అన్ని రకాల తలనొప్పులను లేదా తీవ్రమైన మైగ్రేన్‌ను పూర్తిగా నయం చేస్తుందని చెప్పడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

తలనొప్పిని సహజంగా నియంత్రించే మార్గాలు

తలనొప్పికి అసలు కారణాన్ని తెలుసుకోకుండా టీ మీద మాత్రమే ఆధారపడటం సరైనది కాదు. రోజువారీ జీవితంలో ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం ముఖ్యం..

డీహైడ్రేషన్ నివారణ: శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు తలనొప్పి సర్వసాధారణం. రోజుకు తగినంత మోతాదులో మంచినీరు తాగాలి.

సమయానికి ఆహారం – నిద్ర: పూటకో సమయానికి తినడం మానేసి, సరైన వేళకు భోజనం చేయడం, రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడిని తగ్గించుకోవడం: పని ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి.

వారంలో చాలా రోజులు తరచుగా తలనొప్పి రావడం, కంటి చూపు మసకబారడం లేదా రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

Loading...
Unable to load recommendations.
Follow Us