ఇండియాలో డయాబెటిస్, బీపీ, క్యాన్సర్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఏ ఏటికా యేడు విజృంభిస్తున్న ఈ కేసులతో ఈ దేశం ‘ ఉక్కిరి బిక్కిరి ‘ అవుతోంది. నాన్-కమ్యునికబుల్ డిసీజెస్ (ఎన్ సీ డీ ఎస్) అయిన ఈ కేసుల వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ‘ నేషనల్ హెల్త్ ప్రొఫైల్ ‘ ఓ నివేదికలో ప్రచురించింది. 2018 లో ఆ యా రాష్ట్రాల ఎన్ సీ డీ క్లినిక్ లలో నమోదైన డీటైల్స్ ప్రకారం.. 6.51 కోట్ల ప్రజలకు గాను సుమారు 40 లక్షల మంది వివిధ రుగ్మతలతో బాధ పడుతున్నారట. 11 లక్షల మంది హైపర్ టెన్షన్ తో బాటు డయాబెటిస్ తో కూడా సతమతమవుతున్నట్టు ఈ రిపోర్టు అంచనా వేసింది. మరో 2 లక్షల మంది గుండె జబ్బులతో, 1.68 లక్షల మంది సాధారణ క్యాన్సర్ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిసింది. 2017 లో స్క్రీనింగ్ కోసం దాదాపు మూడున్నర కోట్లమంది ఈ క్లినిక్ లను ఆశ్రయించగా.. 2018 లో ఈ సంఖ్య రెట్టింపు అయింది. ప్రజల్లో ఈ విధమైన వ్యాధుల పట్ల అవగాహన కలిగించి.. వారి ప్రవర్తన, లైఫ్ స్టయిల్ మార్చడం ద్వారా ఈ వ్యాధులను నివారించడానికి, అదుపు చేసేందుకు దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం 2010 లోనే చేబట్టింది. 2017 ఫిబ్రవరిలో ఇవి మరింత స్పీడందుకున్నాయి.క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహాన్ని ముందుగానే గుర్తించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున ‘ డోర్ టు డోర్ ‘ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. ఇండియాలో 35 శాతం మరణాలకు ఈ వ్యాధులే కారణమని అప్పట్లోనే పేర్కొంది. అయితే వైద్య శాస్త్రంలో అనేక నూతన మందులను కనుగొనడం ద్వారాను, మెడికల్ పరికరాలను ఆధునికం చేయడం ద్వారాను కొంతవరకు వీటిని అరికట్టగలుగుతున్నారు. స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్న ఆరున్నర కోట్ల మందిలో డయాబెటిస్ రోగుల సంఖ్య 4.75 శాతం, హైపర్ టెన్షన్ రోగుల సంఖ్య 6.2 శాతం ఉన్నట్టు తేలింది. అయితే ఇండియాలో ప్రజల జీవన కాల పరిమితి 68.7 సంవత్సరాలకు పెరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ఇది ఎక్కువే.. !