
చేలల్లో, డొంకల్లో దట్టమైన అడవుల్లో, పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఒక ప్రత్యేకమైన కాకరకాయను బోడకాకరకాయ లేదా అడవి కాకరకాయ అని పిలుస్తారు. దీనిని ఇష్టపడని వారు అరుదు. ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన ఈ కాకరలో అనేక ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ కాకరను రుచి చూస్తే వ్యాధులు దరిచేరవని ప్రజల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. ఇది కేవలం అటవీ ప్రాంతాల్లోనే, దట్టమైన పొదల్లోని చెట్ల తీగలకు అల్లుకుని పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు, డొంకల్లో, చేలల్లో.. అటవీ ప్రాంతాల్లో అడవి కాకర కాయలు విరివిగా కాస్తాయి. ఈ కాకరలో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా వంటకాల్లో వీటి వాడకం పెరుగుతోంది. అటవీ ప్రాంతాలలో పాటు దట్టమైన పొదల్లో మాత్రమే ఈ చెట్ల తీగలు అల్లుకుంటాయి. సాధారణంగా జులై నెల నుంచి శ్రావణ మాసం చివరి వరకు ఇవి లభ్యమవుతాయి. అయితే, అడవి కాకరగా పిలుచుకునే ఈ కాకరకాయల చెట్లను ఎక్కడ పెంపకం చేపట్టినా అవి మొలకెత్తవని, కేవలం ప్రకృతి సహజ సిద్ధంగా మాత్రమే ఈ చెట్లు, తీగలు పుట్టుకొచ్చి పూతకు వస్తాయని రైతులు పేర్కొంటారు. ఇది దీని ప్రత్యేకతను, విలువను మరింత పెంచుతుంది.
బోడకాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని స్థానికులు చెబుతారు. ముఖ్యంగా షుగర్ (మధుమేహం), రక్తపోటు (బీపీ) నియంత్రణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని ప్రజల్లో నమ్మకం ఉంది. అందుకే దీని ధర ఎంత ఉన్నా, మొదటి పంట చాలా మంచిదని భావించి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. వర్షాలతో అటవీ ప్రాంతాల్లో అడవి కాకర్లు ఎక్కువగా లభ్యమవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు వీటిని అడవుల్లోని చెట్ల తీగల నుంచి సేకరించి స్థానికంగా అమ్మకాలు సాగిస్తారు.
ఆరోగ్య ప్రదాయినిగా పిలవబడుతూ, ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ప్రజలు సైతం వీటి కొనుగోలుకు మక్కువ చూపుతారు. ఈ కాకరలో విటమిన్ బి1, బి2, బి3 లు అధికంగా ఉంటాయని స్థానికులు చెబుతారు. వీటితో పాటు, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, పీచు పదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక సమ్మేళనం రక్తపోటు సమస్యలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఈ అడవి కాకరను “ఆరోగ్య కాకర”గా పిలుచుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారు.
ఎలాంటి రసాయన మందులు వాడకుండా, ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తుండడంతో ప్రజలు ఈ కాకరను బోడ కాకర లేదా అడవి కాకర అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదలై శ్రావణమాసం చివరి వరకు ఈ కాకర విరివిగా లభిస్తుండడంతో, ప్రతి ఒక్కరూ దీనిని ఏడాదిలో ఒక్కసారైనా రుచి చూస్తామని పేర్కొంటుంటారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ కిలో 200 నుంచి 300 రూపాయలకు విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఇది కేవలం ఒక కూరగాయ మాత్రమే కాకుండా, ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన ఔషధ సంపదగా బోడకాకరకాయ ప్రసిద్ధి చెందింది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..