కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..? నిరుద్యోగులకు ఉపశమనం దొరికేనా..?

| Edited By: Team Veegam

Jan 22, 2021 | 4:40 PM

బడ్జెట్ ఏమాత్రం అటూఇటూగా ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..? నిరుద్యోగులకు ఉపశమనం దొరికేనా..?
Follow us on

Budget 2021 Plan :  అంచనాలను మించి దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టే కొత్త బడ్జెట్‌ రూపకల్పన జరుగుతోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ గతిని మార్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఓ పక్క కరోనా విజృంభణతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ఏమాత్రం అటూఇటూగా ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా కష్టకాలం నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అలాగే ఉపాధి కల్పన వంటి లక్ష్యాలతో కేంద్రం బడ్జెట్‌ 2021-22ను ప్రవేశపెట్టొచ్చంటున్నారు. మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌లో వరాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఉద్యోగులు పన్ను తగ్గింపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కంపెనీలు కూడా ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాయి.

ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ 2021లో సొంతింటి కల సాకారం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తన్నట్లు సమాచారం. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రంగాల ప్రజలు పార్లమెంట్‌ వైపే ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత మనదేశంలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న రంగంగా నిలిచిన రియల్ ఎస్టేట్ కరోనా కారణంగా మందగమనంలో కొట్టుమిట్టాడుతోంది. బ్యాంకులు అత్యల్ప వడ్డీకే హోం లోన్లు ఇస్తున్నప్పటికీ ..ఈ కంటితుడుపు చర్యలు సరిపోవని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, మరిన్ని రాయితీలు భారీ ఎత్తున ఇస్తేనే ఈ రంగం కోలుకుంటుందని రియాల్టీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరికీ సొంత ఇల్లు తమ అజెండా అంటున్న కేంద్రం ఈమేరకు సరికొత్త చర్యలతో నిలువనీడను కొనే వెసులుబాటు కల్పించేలా ఎలాంటి ఉద్దీపన చర్యలు తీసుకుంటుందోనని సామాన్యులు ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్టాంప్ డ్యూటీ తగ్గించటంతో ముంబైలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకున్నది. ఈ నేపథ్యంలో ఈసారి మధ్యతరగతి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ప్రతి ఏటా బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు నిర్ణయాలపై సామాన్యుల దృష్టి ఉంటుంది. గత ఏడాది బడ్జెట్‌లో రెండు పన్నుల నుంచి మినహాయింపులు తీసుకురావడం ద్వారా సామాన్యులకు ఊరటనిచ్చింది. గృహ రుణాలపై సంవత్సరానికి 1.5 లక్షల అదనపు మినహాయింపును పొడిగించాలని ప్రతిపాదించడం ద్వారా ఇది పెద్ద ఉపశమనం కలిగించింది. కానీ, ఈ సంవత్సరం కరోనాతో బాధపడుతున్న నిరుద్యోగులు ప్రభుత్వం నుండి చాలా పెద్ద ఉపశమనం ఆశిస్తున్నారు.

ఇక, సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును రూ .1.5 లక్షలకు తగ్గించినట్లు ఎస్కార్ట్ సెక్యూరిటీ పరిశోధన విభాగాధిపతి ఆసిఫ్ ఇక్బాల్ చెప్పారు. 80 సి పరిమితిలో పెరుగుదల ఉంటే, ఎక్కువ మంది ప్రజలు గృహ రుణాలు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఇపిఎఫ్, పిపిఎఫ్ వంటి ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులు పెరుగుతాయని అశిస్తున్నారు. అలాగే, సెక్షన్ 80 టిటిఎ పరిమితిని రూ .30,000 కు పెంచాలని భావిస్తున్నారు.

ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్స్‌కు లాభం చేకూరే పలు నిర్ణయాలు ప్రకటించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వాటిపై వడ్డీ రేట్లు మార్కెట్‌తో లింక్ అయ్యి ఉంటాయి. దీంతో వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గితే.. వీటిపై కూడా ఆ ప్రభావం పడుతోంది. దీంతో కేంద్ర సర్కార్ వీరికి ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకోవచ్చు. మరి కేంద్రం ఎలాంటి బడ్జెట్‌ తీసుకువస్తుందో చూడాలి.

Read Also… అసోంలో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎత్తులు.. ఐదు పార్టీలతో మహాకూటమి ఏర్పాటు