ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లోనే ఎన్నార్సీ అమలు చేస్తారా? బీజేపీ ఎత్తుగడ అదేనా?

| Edited By:

Sep 24, 2019 | 7:03 PM

దేశాన్ని ఎన్నార్సీ అనే పదం వణికిస్తోందా? అసోంలో మొదలైన ఎన్నార్సీ రాబోయే రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు. దేశంలో అక్రమంగా చొరబడి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నవారిని తమ సొంత ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఎన్నార్సీ సహాయపడుతుంది. అయితే ఇది కేవలం రాజకీయ కుట్రగా చూస్తున్నాయి దేశంలోని ప్రతిపక్ష పార్టీలు. స్వయంగా అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సైతం ఎన్నార్సీ ప్రక్రియలో లోపాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. జాతీయ పౌర జాబితాను […]

ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లోనే ఎన్నార్సీ అమలు చేస్తారా? బీజేపీ ఎత్తుగడ అదేనా?
Follow us on

దేశాన్ని ఎన్నార్సీ అనే పదం వణికిస్తోందా? అసోంలో మొదలైన ఎన్నార్సీ రాబోయే రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు. దేశంలో అక్రమంగా చొరబడి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నవారిని తమ సొంత ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఎన్నార్సీ సహాయపడుతుంది. అయితే ఇది కేవలం రాజకీయ కుట్రగా చూస్తున్నాయి దేశంలోని ప్రతిపక్ష పార్టీలు. స్వయంగా అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సైతం ఎన్నార్సీ ప్రక్రియలో లోపాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. జాతీయ పౌర జాబితాను ఖచ్చితంగా అమలు చేయాలని అసోంలో బీజేపీ నిర్ణయించి అక్కడ పలు దఫాలుగా దీన్ని నిర్వహించి ముగించారు. ఈ ప్రక్రియలో తుదకు 19 లక్షల మంది భారతీయులు కాదనే విషయం వెల్లడైంది. సరిగ్గా ఇదే జాబితాలో కార్గిల్‌లో యుద్ధం చేసిన సైనికుడు తన పేరును లిస్ట్‌లో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ విధంగా ఒక్కడు కాదు ఎంతోమంది కుటుంబాల్లో ఒకటి, రెండు పేర్లు లేకుండా పోయాయి. మరీ ముఖ్యంగా చిన్నారుల పేర్లు ఉండి , తల్లి దండ్రుల పేర్లు లేకపోవడం జాబితా తయారు చేయడంలో గల లోపాలను కళ్లకు కట్టినట్టు చూపుతోంది.

గతంలో అసోంలోకి వలసలు భారీగా రావడంతో అక్కడ లక్షల సంఖ్యలో జనం స్ధిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది బ్రిటీషు వాళ్లు వలసలను ప్రోత్సహించడం వల్లే ఇలా జరిగిందన్నది చరిత్ర చెబుతుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇటువంటిది జరగలేదు. పైగా వలసవాదులపై అసోంలో స్ధానికంగా పెద్ద ఉద్యమం వచ్చినా దాన్ని ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఇన్నాళ్లకు బీజేపీ ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా ఎన్నార్సీని అమలు చేసింది.

అయితే ఇదే అంశంపై బీజేపీ నేతలు ఘాటైన వ్యక్యలు చేయడం పలు వర్గాల వారికి బాధకు గురిచేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీ నేత, మాజీ మంత్రి షాన్ వాజ్ హుసేన్ మాట్లాడుతు ఈదేశం ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నార్సీ గురించి దేశంలోని హిందువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నార్సీ జాబితాలో పేరు లేకున్నా ఒక్క హిందువు కూడా దేశం వదిలి వెళ్లకుండా చూస్తామంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భరోసా ఇచ్చారు. వారికి తాము అండగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఎన్నార్సీ ప్రక్రియ అమలు అనేది రోజు రోజుకు వివాదాస్పదంగా మారిపోతుంది. నెక్స్ట్ బెంగాల్ రాష్ట్రమే అని కేంద్రం చెప్పడంతో ఇప్పటికే ఆరుగురు మరణించడం బాధాకరమే. ఇదే విషయంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్‌లో ఎన్నార్సీకి స్ధానం లేదని, కేంద్రంలో బీజేపీ తమ ప్రజల్ని భయానికి గురిచేస్తోందని దీని కారణంగా ఇప్పటికే ఆరుగురు మరణించారని తెలిపారు. తమ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడా ఇది అమలు కాకుండా పోరాటం ఉధృతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాంటి వ్యాఖ్య చేశారు.

దేశంలోపల ఎన్నార్సీపై ఈ విధంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే.. దేశం వెలుపల కూడా బీజేపీ వైఖరిపై నిరసనలు పెరుగుతున్నాయి. ఆదివారం అమెరికాలోని హోస్టన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలు ర్యాలీ చేశారు. భారత్‌లో రామరాజ్యం అనే మాటకు అర్ధం లేకుండా పోయిందని, ప్రస్తుతం ఎన్నార్సీ హిందూ, ముస్లిం వర్గాలను విడదీసే విధంగా బీజేపీ వ్యవహరింస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో హిందూ మూకలు జరిపిన మూక దాడుల్లో 100 మంది ముస్లింలు మరణించారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నార్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. బీజేపీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం వలసలను నిరోదించడానికి, అసలైన భారతీయులను గుర్తించడానికి మాత్రమే తాము ఎన్నార్సీని అమలు చేస్తున్నామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు ఎన్నార్సీని అమలు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. త్రిపురలో దీన్ని అమలు చేయాలని మమతా బెనర్జీ బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ దాన్ని అమలుచేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ తన పూర్వీకులు భారతీయలు కాకపోవడంతో ఆయన పేరు జాబితా నుంచి తొలగించే వీలుందని, ఈ కారణం చేతనే అక్కడ ఎన్నార్సీని అమలు చేయడం లేదని వాదిస్తున్నారు బెంగాల్ దీదీ. త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ పుట్టింది త్రిపురలోనే అయినా ఆయన తల్లితండ్రులు మాత్రం భారతీయులు కాదు. వీరు తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి త్రిపురలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 1967 జూన్ నెలనుంచి ఈయన తండ్రి భారతీయునిగా అధికారికంగా గుర్తింపు పొందారు. బిప్లవ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఆరెస్సెస్‌లో చేరారు. ఆ విధంగా బిప్లవ్ బీజేపీలో ప్రవేశించారు. అయితే త్రిపురలో ఎన్నార్సీ అమలు చేస్తే బీజేపీకే నష్టం అనే వాదన బలం చేకూరుతుంది. అదే విధంగా మన దేశం నుంచి విడిపోక ముందు పాకిస్తాన్ కరాచీలో పుట్టిన మరో సీనియర్ నేత ఎల్ కే అద్వానీ. ఆయన అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారు. అయితే విభజన తర్వాత ఇండియాకు వచ్చి స్దిరపడ్డారు.

ఈ విధంగా చూస్తూ బీజేపీ ఎన్నార్సీని రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించడానికి ఉపయోగిస్తుందనే ప్రతిపక్ష పార్టీల వాదనకు బలం చేకూరుతుంది. ఏది ఏమైనా దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన వలసలను నిరోధానికి ఉపయుక్తమైన ఎన్నార్సీ విషయంలో ఆయా రాష్ట్ర ప్రజల్లో మాత్రం ఎన్నో అనుమానాలు మాత్రం మిగిలే ఉన్నాయి.