కొవాగ్జిన్‌ తుది దశ ప్రయోగాల్లో విచిత్ర పరిస్థితి.. కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల కొరత

| Edited By: Pardhasaradhi Peri

Dec 26, 2020 | 4:48 PM

రాకాసి వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ ప్రయోగాలను చేపడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. అయితే, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా కొవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

కొవాగ్జిన్‌ తుది దశ ప్రయోగాల్లో విచిత్ర పరిస్థితి.. కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల కొరత
Covaxine
Follow us on

ఏడాది క్రితం చైనాలో పుట్టిన మాయదారి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ రాకాసి వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ ప్రయోగాలను చేపడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. అయితే, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా కొవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల కొరత ఏర్పడింది. ప్రయోగాల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చేందుకు ఆయిష్టత చూపుతున్నారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు అవసరమైన వాలంటీర్లు దొరకడం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కరోనా మహమ్మారిని అంతం చేసే టీకా అందుబాటులోకి వస్తుందన్న భావన నెలకొనడంతో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి వాలంటీర్లు ఆసక్తి చూపడంలేదని ఎయిమ్స్ కోవాక్సిన్ కో-ఇన్వెస్టిగేటర్ డాక్టర్ పునీత్ మిశ్రా తెలిపారు.

దేశవ్యాప్తంగా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌‌కు 26వేల మంది వాలంటీర్ల అవసరముందని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 1,500 నుంచి 2,000 మంది వరకు వాలంటీర్లు అవసరం కాగా.. ఇప్పటివరకు 350 మంది మాత్రమే ముందుకు వచ్చినట్లు ఎయిమ్స్‌ అధికారి అన్నారు. తొలి దశ ప్రయోగాలకు 100 మంది అవసరమైతే 4,500 మంది ఆసక్తి చూపారని, రెండో దశ ట్రయల్స్‌కు 4వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకటనలు, ఈ మెయిళ్లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని పునీత్ మిశ్రా సూచించారు.

‘మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం పెద్దు ఎత్తున వాలంటీర్లు ముందువచ్చారు.100 మంది వాలంటీర్లు పాల్గొనాల్సి ఉంటే 4,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మూడో దశ కోసం వస్తున్న వాలంటీర్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, ఒకటి రెండు వారాల్లో దేశవ్యాప్తంగా కరోనా టీకా అందుబాటులోకి వస్తుందనే భావనతో కొవాగ్జిన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని పునీత్ మిశ్రా అన్నారు. అయితే, ఈ నెలాఖరునాటికి లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, దేశంలో కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తుచేసిన మూడు సంస్థల్లో భారత్ బయోటెక్ ఒకటి. ఐసీఎంఆర్‌తో కలిసి టీకాను అభివృద్ధిచేసిన భారత్ బయోటెక్.. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించింది. టీకా సురక్షితమైందని, అంతగా దుష్ప్రభావాలు తలెత్తలేదని డాక్టర్ రాయ్ తెలిపారు. తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌ అస్వస్థతకు గురికాగా.. అది టీకా వల్ల కాదని గుర్తించినట్టు పేర్కొన్నారు.