శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తెరుచుకుంటున్న వైకుంఠ ద్వారాలు.. ఒక్క రోజు కాదు.. పది రోజులు…

|

Dec 11, 2020 | 9:22 PM

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజున ప్రముఖ వైష్ణవాలయాలలో ఉత్తరద్వారం నుంచి మాధవుడిని దర్శిస్తారు..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తెరుచుకుంటున్న వైకుంఠ ద్వారాలు.. ఒక్క రోజు కాదు.. పది రోజులు...
Follow us on

పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమహావిష్ణువును దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజున ప్రముఖ వైష్ణవాలయాలలో ఉత్తరద్వారం నుంచి మాధవుడిని దర్శిస్తారు భక్తులు!

ముక్కోటి ఏకాదశి..! మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పర్వదినం! ఉత్తరద్వార దర్శనం కోసం భక్తకోటి నిరీక్షించే సమయం! శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవాలయాల్లో..వైకుంఠ ఏకాదశి మొదలు.. పది రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు.

అయితే తిరుమల చరిత్రలో తొలిసారిగా ఆ అవకాశం భక్తులకు ఈ వైకుంఠ ఏకాదశి నుంచే లభించనుంది. ముక్కోటి మొదలు.. భక్తులకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించాలన్న టీటీడీ నిర్ణయానికి.. ఆగమ పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతుల ఆమోదం లభించింది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నారు.

ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్షలాది భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. ఉత్తరద్వార దర్శనం కోసం వీవీఐపీలు కూడా క్యూ కడతారు. అయితే ఏటా ముక్కోటి ఏకాదశి సందర్భంలో..రెండు రోజులు మాత్రమే తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ద్వాదశిరోజు అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూసివేస్తారు. దీంతో వైకుంఠ ద్వారం నుంచి ప్రవేశించి..కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించాలన్న లక్షలాది భక్తులకు నిరాశే మిగిలేది.

వైకుంఠ ఏకాదశికి వేంకటాచలపతిని దర్శించాలని భక్తులు తపిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ముక్కోటికి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆరాటపడతారు. కానీ వైకుంఠ ద్వార దర్శన భాగ్యం అందరికీ దక్కదు. అయితే శ్రీవారి భక్తుల మనస్సు తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప నిర్ణయం తీసుకుంది. తిరుమల చరిత్రలోనే తొలిసారిగా.. ముక్కోటి నుంచి పది రోజులపాటు.. వైకుంఠ ద్వార దర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తోంది.