కేంద్రం కీలక నిర్ణయం: మన దేశం.. మన మందులు..

|

Jul 15, 2020 | 4:38 PM

చైనా ఆధారిత ఉత్పత్తులను తగ్గించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం స్వదేశీ ఉత్పాదకతను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనాపై ఆధారపడకుండా మన దేశంలోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ తయారు చేసేలా ఫార్మా కంపెనీలను ప్రోత్సాహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్రం కీలక నిర్ణయం: మన దేశం.. మన మందులు..
Follow us on

చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. చర్చల్లో ఒక మాట.. చేతల్లో ఒక తీరు కనబరుస్తున్న చైనాకు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. సైనిక పరంగా సరిహద్దులు మోహరిస్తూనే, ఆర్థికంగా కూడా దెబ్బ తీసేందుకు స్కెచ్ వేసింది. చైనా ఆధారిత ఉత్పత్తులను తగ్గించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం స్వదేశీ ఉత్పాదకతను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనాపై ఆధారపడకుండా మన దేశంలోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ తయారు చేసేలా ఫార్మా కంపెనీలను ప్రోత్సాహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

డ్రాగన్ కంట్రీ నుంచి యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ వంటి ముడి సరుకుల కొనుగోలును సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని ఫార్మా కంపెనీలకు కేంద్ర సూచిస్తోంది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా మూడు చోట్ల బల్క్ డ్రగ్ పార్కులను, నాలుగు ప్రాంతాల్లో మెడికల్ డివైజ్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చేతులు కలిపి బల్క్ డ్రగ్ పార్కులను నిర్మించాలని ఈ ఏడాది మార్చిలోనే కేబినెట్ తీర్మానించింది. వీటిలో సాల్వెంట్ రికవరీ ప్లాంట్, డిస్టిలేషన్ ప్లాంట్, పవర్ స్టీమ్ యూనిట్స్, వ్యర్థాలను శుభ్రపరిచే ప్లాంటు వంటివి ఉంటాయి. ఒక్కో పార్కు నిర్మాణానికి కేంద్రం రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్ల వరకు అందిస్తుంది. ఈ పార్కుల ఏర్పాటు కోసం రాబోయే ఎనిమిదేళ్లలో మొత్తం రూ.6,940 కోట్లు ఖర్చు చేస్తారు. పీఎల్ఐగా పిలిచే ఈ స్కీమ్ ద్వారా ఫార్మా కంపెనీలకూ ఆర్థిక సాయం అందుతుంది. ఫలితంగా కీలకమైన 53 డ్రగ్ల తయారీకి అవసరమైన ఏపీఐలనూ మన దేశంలోనే తయారు చేయడం సాధ్యమవుతుంది. దీంతో తొలుత పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తమ రాష్ట్రంలోని భటిండాలోని బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది.

మరోవైపు, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు కేంద్ర అన్నివిధాలుగా సదుపాయాలు కల్పించాలని ఫ్లాన్ చేస్తోంది. ఆర్థికపరమై అంశాల్లోనూ సహాయం అందించాలని కూడా భావిస్తోంది. ఫర్మంటేషన్ ఆధారిత ఎరిత్రోమైసిన్ వంటివి తయారు చేస్తే సేల్స్ పై 20 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపింది. కెమికల్ సింథసిస్ ఆధారంగా తయారు చేసే పారాసిటామల్ వంటివి ప్రొడ్యూస్ చేస్తే 10 శాతం ఇన్సెంటివ్ ఆరేళ్లపాటు ఇస్తారు. పీఎల్ఐ స్కీమ్ అమలు వల్ల మనదేశంలో రూ.46,400 కోట్ల విలువైన బల్క్ డ్రగ్స్ తయారవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఫలితంగా దేశంలో ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కరోనా కారణంగా చైనా నుంచి ఏపీఐలు సరిగ్గా రాకపోవడంతో మందుల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికితోడు సరిహద్దుల్లో ఇండియా సైనికులతో ఇటీవల చైనా సైనికులు ఘర్షణపడటంతో, ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి. చైనా ప్రొడక్టుల దిగుమతులను తగ్గించుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.