డిజైన్లు ఖరారు, అయోధ్యలో నిర్మించే మసీదు ఎలా ఉంటుందనే సస్పెన్స్‌కు తెర

|

Dec 20, 2020 | 7:38 AM

అయోధ్యలో ఒకవైపు మందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా ఇటు మసీదును కూడా నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది అయోధ్యలోని..

డిజైన్లు ఖరారు, అయోధ్యలో నిర్మించే మసీదు ఎలా ఉంటుందనే సస్పెన్స్‌కు తెర
Follow us on

అయోధ్యలో ఒకవైపు మందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా ఇటు మసీదును కూడా నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది అయోధ్యలోని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌. అయోధ్య జిల్లాలో నిర్మించతలపెట్టిన మసీదు, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన నమూనా ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. వచ్చే ఏడాది శంకుస్థాపన చేసి, మొదటి దశలో భాగంగా మసీదు, ఆస్పత్రి నిర్మాణం చేపట్టి, రెండో దశలో ఆస్పత్రిని విస్తరించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయోధ్యలోని ధానీపూర్‌లో గల ఐదెకరాల స్థలంలో వీటిని నిర్మించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ మసీదుల డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇండో ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్ ట్రస్టు తెలిపింది. ప్రొఫెసర్‌ ఎస్‌ఎం అక్తర్‌ ఈ బిల్డింగు డిజైన్లను రూపొందించినట్లు ఇండో ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు తెలిపింది. మ్యూజియంతో పాటు ఇండో ఇస్లామిక్‌ సంస్కృతీ సాహిత్యాలపై పరిశోధనలు చేసే విధంగా ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించింది. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని తెలిపింది సుప్రీంకోర్ట్‌.

అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్ట్‌ ఆదేశాలతో అయోధ్య నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు స్థలం కేటాయించింది. ఈ స్థలాన్ని స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్‌బోర్డు.. మసీదు నిర్మాణానికై ఐఐసీఎఫ్‌ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టులో భూమి పూజ చేశారు. ఇప్పుడు మసీదు నిర్మాణం కోసం డిజైన్లు ఖరారు కావడంతో మసీదును కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది ఇండో ఇస్లామిక్‌ కల్చరర్‌ ఫౌండేషన్‌ ట్రస్టు. దీని కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది.