చల్లా ధర్మారెడ్డి ఇష్యూ : బీజేపీ నాయకుల దాడికి నిరసన, నేడు పరకాల నియోజకవర్గం ఆరు మండలాలు బంద్

|

Feb 01, 2021 | 12:28 AM

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఆరు మండలాలలో ఇవాళ(సోమవారం) బంద్‌ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, స్థానిక అన్ని వ్యాపార వర్గాల అధ్యక్షులు ఈ బంద్ కార్యక్రమంలో..

చల్లా ధర్మారెడ్డి ఇష్యూ : బీజేపీ నాయకుల దాడికి నిరసన, నేడు పరకాల నియోజకవర్గం ఆరు మండలాలు బంద్
Follow us on

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఆరు మండలాలలో ఇవాళ(సోమవారం) బంద్‌ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, స్థానిక అన్ని వ్యాపార వర్గాల అధ్యక్షులు ఈ బంద్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం హనుమకొండలో ఎమ్మెల్యే ఇంటి పై బీజేపీ నాయకులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలు బంద్ కు పిలుపునిచ్చారు.

కాగా, ఆదివారం హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మాణం కోసం బీజేపీ శ్రేణులు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ అంశంపైనే ధర్మారెడ్డి బీజేపీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు తమ పార్టీ కండువాలు కప్పుకొని చందాలు వసూలు చేస్తున్నారని, రాముడి పేరుని రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. రాముడు బీజేపీ వాళ్లకే కాదు, అందరికి దేవుడన్నారు. ఈ క్రమంలో ధర్మారెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టిన బీజేపీ నేతలు హన్మకొండలోని ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు, టమోటాలు, కోడి గుడ్లు విసిరారు. బీజేపీ ఆందోళనకారుల దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, తన ఇంటిపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి. “విరాళాలకు లెక్కా పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే, నా ఇంటిపై దాడి చేస్తారా?” అంటూ మండిపడ్డారు ధర్మారెడ్డి. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాముడు బీజేపీ నేతలకే దేవుడు కాదని….భారతీయులందరికి ఆరాధ్య దైవమేనన్నారు. ఇదిలాఉండగా, హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటి పై జరిగిన దాడి ఖండిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు పరకాలలో ఆదివారం ధర్నా నిర్వహించారు. బీజేపీ దిష్టి బొమ్మ తగలబెట్టారు. బీజేపీ నాయకుల దౌర్జన్యాలు అరాచకాలు నశించాలని నినాదాలు చేశారు.